#1983WorldCup: రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది

40 Years Completed For 1983 World Cup Win-By Kapil Devils - Sakshi

భారత క్రికెట్‌లో ఈరోజుకు(జూన్‌ 25) ఒక విశిష్టత ఉంది. కపిల్‌ డెవిల్స్‌ వన్డే వరల్డ్‌కప్‌ సాధించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన విండీస్‌ను ఫైనల్లో ఓడించి ప్రఖ్యాత లార్డ్స్‌ బాల్కనీ నుంచి వరల్డ్‌కప్‌ ట్రోపీని అందుకోవడం ఎవరు మరిచిపోలేరు.

1983.. టీమిండియా క్రికెట్‌ భవిష్యత్తును మార్చివేసిన సంవత్సరంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఏదో మొక్కుబడిగా మ్యాచ్‌లు చూసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది. కానీ భారత్‌ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత దేశంలో క్రికెట్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా భారత్‌ క్రికెట్‌లో నూతన ఒరవడి 1983కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది.

ఇప్పుడంటే క్రికెట్‌లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐ తన కనుసైగలతోనే క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ డెవిల్స్‌ భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు.  ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వేను ఇంగ్లండ్ అవమానించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోతుంది.

అసలు ఏం జరిగింది?
ఎన్‌కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం కపిల్‌ నేతృత్వంలోని భారత్‌ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అసమాన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్‌ విజేత వెస్టిండీస్‌ ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు రావడంతో టీమిండియా కప్‌ కొడుతుందన్న నమ్మకం ఎవరికి లేదు. అప్పటికి భారత్‌ ఫైనల్‌ దాకా వెళ్లడమే చాలా గొప్ప ఫీట్‌ అని చెప్పుకున్నారు.

అదే సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఆతిథ్య ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు నుంచి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే టికెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు  ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్‌ ప్రపంచకప్‌ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. 

కానీ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు చేసిన అవమానం సాల్వే మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 1975,79,83 వరల్డ్‌కప్‌లు చూసుకుంటే ఈ మూడు ఇంగ్లండ్‌ గడ్డపైనే జరిగాయి. అప్పట్లో మిగతా దేశాల్లో క్రికెట్‌కు అనుగుణమైన పరిస్థితులు అంతగా లేవు.

కానీ సాల్వే ఎలాగైన తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు.ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయాలంటే ఈసారి జరగబోయే వరల్డ్‌కప్‌ కచ్చితంగా ఇంగ్లండ్ వెలుపల జరగాల్సిందే. 1987 ప్రపంచ కప్‌(1987 World Cup)ను భారత్‌, పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సాల్వే ప్రతిపాదన పంపాడు. ప్రపంచకప్‌కు భారత్‌, పాక్‌లు ఆతిథ్యమిస్తున్న విషయం తెలుసుకొని కంగుతిన్న ఇంగ్లండ్ ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించలేవని పేర్కొంది.

ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్‌లో పాకిస్థాన్ కౌన్సిల్‌తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్‌తో కలిసి టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. 

ఇప్పటికి మూడుసార్లు వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్‌  ఈ ఏడాది నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల క్రితం 2011 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా.. ధోని నేతృత్వంలో రెండోసారి టైటిల్‌ను కొల్లగొట్టింది.  తాజాగా రోహిత్‌ కెప్టెన్సీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్‌ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

చదవండి: రోహిత్‌ వద్దు.. ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ అతడే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top