T20 World Cup 2022: బుమ్రా దూరం.. సరైన బౌలర్లు లేరు; టీమిండియాకు కష్టమే!

Team India Big Dilemma No Star Bowler After Bumrah Ruled-Out T20 WC 2022 - Sakshi

భారత స్టార్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమవడం టీమిండియాను మరోసారి చిక్కుల్లోకి నెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బుమ్రా జట్టుకు దూరమవడం పెద్ద దెబ్బే. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాకు సరైన పేస్‌ బౌలర్లు అందుబాటులో లేరు. దీనికి తోడు ఇప్పటికే స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మోకాలి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరంగా ఉన్నాడు. ఏకకాలంలో బుమ్రా, జడేజా లాంటి టాప్‌ ఆటగాళ్లు దూరమవడం టీమిండియాను ఇబ్బందుల్లో పడేసింది.

ఇక సుధీర్ఘ విరామం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా పట్టుమని రెండు మ్యాచ్‌లు ఆడాడో లేదే మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది. ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో బుమ్రా పరుగులు సమర్పించుకున్నప్పటికి అతని గుడ్‌లెంగ్త్‌, యార్కర్‌ డెలివరీలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా రెండో టి20లో ఫించ్‌ను బుమ్రా ఔట్‌ చేసిన విధానం సూపర్‌ అని చెప్పొచ్చు. ఈ ఒక్క వికెట్‌ బుమ్రా ఈజ్‌ బ్యాక్‌ అనేలా చేశాయి. కానీ విధి మరొకటి తలిచింది. సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌ ఆరంభానికి ముందే బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది. ఈ విషయాన్ని బీసీసీఐ బయటికి తెలియనివ్వలేదు. రోహిత్‌ కూడా తొలి టి20కి బుమ్రాకు రెస్ట్‌ మాత్రమే ఇచ్చామని పేర్కొన్నాడు. తీరా చూస్తే బుమ్రా.. ఇప్పుడు ఏకంగా వెన్నునొప్పితో టి20 ప్రపంచకప్‌కే దూరమయ్యాడు.

షమీ ఏ మేరకు రాణించగలడు?
అయితే బుమ్రాను పక్కనబెడితే ప్రస్తుతం జట్టులో నిఖార్సైన పేసర్లు అందుబాటులో లేరు. మరో సీనియర్‌ క్రికెటర్‌ మహ్మద్‌ షమీ అందుబాటులో ఉన్నప్పటికి అతను టి20 మ్యాచ్‌ ఆడి ఏడాది గడిచిపోయింది. మరి షమీని అయినా సరిగ్గా వాడుకున్నారా అంటే అది లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేయగానే షమీ కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు.

తాజాగా కరోనా నుంచి కోలుకున్నప్పటికి షమీ.. సౌతాఫ్రికాతో జరగనున్న మిగతా రెండు టి20ల్లో ఎంత ప్రభావం చూపిస్తాడనేది మ్యాచ్‌లో చూస్తే గాని తెలియదు. అయితే షమీ బౌలింగ్‌ ఆస్ట్రేలియా పిచ్‌లకు సరిగ్గా అతుకుతాయి. అతని గుడ్‌లెంగ్త్‌ డెలివరీలు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ షమీ ప్రాక్టీస్‌ చేయడానికి తగినంత సమయం లేదు. మహా అయితే ప్రొటిస్‌తో రెండు టి20లు.. ఆ తర్వాత ప్రపంచకప్‌లో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకుంటే షమీపై పెద్ద బాధ్యత ఉన్నట్లే.

అవకాశాలు వినియోగించుకోని ఆవేశ్‌ ఖాన్‌.. అర్ష్‌దీప్‌ను నమ్మలేని పరిస్థితి
ఇక ఫాస్ట్‌ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆవేశ్‌ ఖాన్‌కు విరివిగా అవకాశాలు ఇచ్చినా సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఇక మరో వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ ఆరంభ ఓవర్లలో ఆకట్టుకున్నప్పటికి..డెత్‌ ఓవర్లలో తేలిపోతున్నాడు. భువీ తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకప్పుడు టీమిండియా ప్రధాన పేసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన భువీ ఇ‍‍ప్పుడు మాత్రం సరైన లైనఫ్‌ లేమితో ఇబ్బంది పడుతున్నాడు.

ఇక దీపక్‌ చహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లు జట్టులో ఉన్నప్పటికి వాళ్లని ఎక్కువగా నమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక మ్యాచ్‌లో బాగా బౌలింగ్‌ చేస్తే మరొక మ్యాచ్‌లో విఫలమవడం కనిపిస్తోంది. ఈ ఇద్దరిలో దీపక్‌ చహర్‌ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఇక హర్షల్‌ పటేల్‌ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఆసీస్‌తో టి20 సిరీస్‌లో దారుణంగా విఫలమయిన హర్షల్‌ పటేల్‌.. సౌతాఫ్రికా సిరీస్‌లోనూ అదే ప్రదర్శన కనబరిచాడు. వికెట్లు తీస్తున్నప్పటికి దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌కు చివరి నిమిషంలో షమీ దూరం కావడంతో అతని స్థానంలో వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికి.. భారీగానే పరుగులు ఇచ్చుకున్నాడు.

సిరాజ్‌ను ఎంపిక చేస్తారా?


సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. దీంతో బుమ్రా ప్లేస్‌లో అనుభవం ఓ సీనియర్ బౌలర్ అవసరం భారత జట్టుకి బాగా ఉంది. మరి రెండేళ్ల క్రితం స్టార్‌ బౌలర్లు లేకుండానే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ గెలిచిన టీమిండియా మరోసారి అలాంటి ప్రదర్శన ఇస్తుందా అంటే చెప్పలేం. అప్పటి సిరీస్‌లో హీరోగా నిలిచిన మహ్మద్‌ సిరాజ్‌, నటరాజ్‌న్‌లు టీమిండియాకు దూరమయ్యారు. మరి గాయంతో దూరమైన బుమ్రా స్థానంలో సిరాజ్‌ జట్టులోకి తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఇటీవలే కౌంటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్‌ను టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసినా ఆశ్చర్యపోవనసరం లేదు. 

ఇవన్నీ చూస్తుంటే టి20 క్రికెట్‌లో అంతగా అనుభవం లేని మహ్మద్‌ షమీనే టి20 ప్రపంచకప్‌లో పెద్ద దిక్కు కానున్నాడనిపిస్తుంది. ఈ సమయంలో టీమిండియాకు వేరే ఆప్షన్‌ కూడా కనిపించడం లేదు. దీంతో టీమిండియా టి20 ప్రపంచకప్‌లో సరైన బౌలింగ్‌ లేమితో కష్టాలు ఎదుర్కొనేలానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్‌లపై స్పిన్నర్లు చాలా తక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక షమీ నేతృత్వంలోనే దీపక్‌ చహర్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌లతో పాటు మహ్మద్‌ సిరాజ్‌(జట్టులోకి ఎంపికయితే) ఎలా బౌలింగ్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

బీసీసీఐ తప్పిదం కూడా..
కాగా టీమిండియా బౌలింగ్‌ విషయంలో బీసీసీఐది కూడా తప్పు ఉంది. ఎంతసేపు ఇచ్చిన బౌలర్‌కే అవకాశాలు ఇస్తూ పెద్ద తప్పే చేసింది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన దీపర్‌ చహర్‌కు అవకాశాలు ఇవ్వకపోవడం.. బుమ్రా, షమీలు గాయపడితే మరొక బౌలర్‌ను తయారుచేయలేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒక బౌలర్‌ గాయపడితే.. అతని స్థానంలో మరొక బౌలర్‌ ఉండేలా చూసుకుందే తప్ప అతను ఫామ్‌లో ఉన్నాడా లేదా అనే విషయాన్ని పట్టించుకోలేదు.

స్పిన్నర్ల విషయం పక్కనబెడితే టీమిండియాకు పేస్‌ బౌలర్లు లేరని కాదు.. మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌, ప్రసిధ్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌ లాంటి వారు అందుబాటులో ఉన్నప్పటికి వాళ్లని ఆడించకపోవడం లేదా జట్టుకు దూరంగా ఉంచడం చేసింది. దీంతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. తీరా ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు నిఖార్సైన, నమ్మదగిన బౌలర్‌ లేకుండా పోయాడు.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

చదవండి: బుమ్రాకు తిరగబెట్టిన గాయం.. టి20 ప్రపంచకప్‌కు దూరం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top