BCCI: రాహుల్‌ నా కళ్లు తెరిపించాడు: జస్టిన్‌ లాంగర్‌ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

BCCI: కేఎల్‌ రాహుల్‌ నా కళ్లు తెరిపించాడు: జస్టిన్‌ లాంగర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Fri, May 24 2024 10:41 AM

1000 Times More Politics: KL Rahul Truth Bomb To Justin Langer On India Coach Role

టీమిండియా హెడ్‌ కోచ్‌ రేసులో వినిపిస్తున్న పేర్లలో జస్టిన్‌ లాంగర్‌ పేరు ఒకటి. గతంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా పనిచేసిన లాంగర్‌.. ఆటగాళ్లతో విభేదాల నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.

ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న జస్టిన్‌ లాంగర్‌ 2024లో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జట్టుకట్టాడు. పదిహేడో సీజన్‌లో లక్నోకు కోచ్‌గా నియమితుడయ్యాడు ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్.

లాంగర్‌ మార్గదర్శనంలో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో లక్నో అద్భుతాలు సాధిస్తుందనుకుంటే కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి సీజన్‌ను ముగించింది.

ద్రవిడ్‌ వారసుడు ఎవరు?
ఇదిలా ఉంటే.. బీసీసీఐ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కొత్త కోచ్‌ వేట మొదలుపెట్టిన నేపథ్యంలో జస్టిన్‌ లాంగర్‌, రిక్కీ పాంటింగ్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తదితర విదేశీ కోచ్‌ల పేర్లు తెరమీదకు వచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన జస్టిన్‌ లాంగర్‌ బీబీసీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో కేఎల్‌ రాహుల్‌ తనకు వివరించాడంటూ బాంబు పేల్చాడు.

అంతకు మించి.. వెయ్యి రెట్లు అధికంగా
‘‘కోచ్‌ పాత్ర ఎలాంటిదో నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుతో గడిపినపుడే నాకు అర్థమైంది. అప్పుడు నేనైతే పూర్తిగా అలసిపోయాను. ఇక భారత జట్టు హెడ్‌ కోచ్‌ బాధ్యత ఎలా ఉంటుందన్న విషయం గురించి నేను కేఎల్‌ రాహుల్‌తో మాట్లాడినపుడు ఆసక్తికర సమాధానం విన్నాను.

‘ఐపీఎల్‌ జట్టు విషయంలో ఒత్తిడి, రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అందుకు వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్‌ టీమిండియా కోచ్‌గా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు.

అంతకంటే గొప్ప సలహా మరొకటి ఉంటుందని నేను అనుకోను’’ అని జస్టిన్‌ లాంగర్ పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి విషయంలో తనకు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చిందని తెలిపాడు. ఒక విధంగా కేఎల్‌ రాహుల్‌ తన కళ్లు తెరిపించాడని పేర్కొన్నాడు.

రిక్కీ పాంటింగ్‌ సైతం
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ సైతం టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్న విషయం తెలిసిందే. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నానని.. అందుకే బీసీసీఐ ఆఫర్‌ ఇచ్చినా తాను తిరస్కరించానని తెలిపాడు.

చదవండి: IPL 2024: టైమ్‌కి చెక్‌ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?

Advertisement
 
Advertisement
 
Advertisement