హుస్నాబాద్/హుస్నాబాద్‌రూరల్: మోడల్ స్కూల్లో శనివారం 2027–28 విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ మనీల శుక్రవారం తెలిపారు. 185 మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రం కేటాయించగా, ఇంగ్లిష్ మీడియంలో 158 మంది, తెలుగు మీడియంలో 27 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఉదయం 11:30 నుంచి 1:30 వరకు పరీక్ష జరుగుతుందని విద్యార్థులు ఉదయం 10:30 గంటలకు వరకు హాల్‌టికెట్, గుర్తింపు కార్డు తీసుకుని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. పరీక్షలకు ఒక సీఎస్‌ను, 9 మంది ఇన్విజిలేటర్లను కేటాయించినట్లు పేర్కొన్నారు.
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భక్తులు వేసిన కానుకలతో 71రోజుల్లో హుండీ ద్వారా రూ.74,46,087ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీకాంతరావు తెలిపారు. స్వామి వారి ఆలయ ముఖ మండపంలో శుక్రవారం ఆలయంలోని హుండీలనూ ఆలయఈఓ, మెదక్ అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు, దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ74,46,087, విదేశీ కరెన్సీ నోట్లు 44 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు వేసిన మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి ఆభరణాలను హుండీలో వేసి సీల్ చేసినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ డీఈవో రమేశ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో భాగంగా మిరుదొడ్డి మోడల్ స్కూల్‌లో ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ ఇవ్వడానికి ఆరుగురు పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రమేశ్ శుక్రవారం తెలిపారు. గణితం (2), భౌతిక(1), రసాయన(1), జీవ(1), జంతుశాస్త్రాలలో (1) ఖాళీలున్నాయన్నారు. అభ్యర్థులు స్థానికులై ఉండాలని, పీజీలో సంబంధిత సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించి, ఇంతకుముందు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉండాలన్నారు. గంటకు రూ.650 పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల్లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని టీటీఆర్‌సీ భవనంలో జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్లానింగ్ అండ్ క్వాలిటీ కో ఆర్డినేటర్ సమగ్ర శిక్ష అభియాన్ రామస్వామి, జిల్లా సైన్స్ అధికారి రాజమౌళి తెలిపారు. పాఠశాలస్థాయిలో జరిగిన చెకుముకి పోటీల్లో 25 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. మండల స్థాయిలో 1,070 మంది పాల్గొనగా 190 మంది విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. శనివారం నిర్వహించనున్న జిల్లాస్థాయి పోటీలలో 190 మంది విద్యార్థులు హాజరవ్వనున్నారని, అందులో 12 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో రాణించిన 12 మంది విద్యార్థులు డిసెంబర్ 11 నుంచి 13 వరకు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.


