హుస్నాబాద్–సిద్దిపేట రహదారిపై గ్రామస్తులతో బీజేపీ ధర్నా
కోహెడరూరల్(హుస్నాబాద్): నాగసముద్రాల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రాంగణాన్ని రెండుగా చీల్చేలా రూపొందించిన రహదారి అలైన్మెంట్ను వెంటనే మార్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. రోడ్డు పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ నాగసముద్రాల, బత్తులవానిపల్లి గ్రామాల ప్రజలు హుస్నాబాద్–సిద్దిపేట ప్రధాన రహదారిపై శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం మాట్లాడుతూ...ఎస్ ఆకారంలో అలైన్మెంట్ రూపొందించారన్నారు. దీనివల్ల ఆటస్థలం కనుమరుగై విద్యార్థుల భద్రత, విద్య వాతావరణం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపరిహారం కింద పాఠశాల ఖాతాలో జమైన రూ.62లక్షలను పేరెంట్స్ కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలకు తెలియకుండా ప్రిన్సిపాల్ ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. ఈ నిధులతోపాటు పాఠశాల పీఎంశ్రీ రూ.2కోట్ల నిధుల వినియోగంపైనా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


