సబ్సిడీ కోసం దరఖాస్తులు
ఎల్‌నినోను ఎదుర్కొందాం..
● సబ్సిడీపై నీటిని పొదుపు చేసే పరికరాలు
● దరఖాస్తు చేసుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు
మిరుదొడ్డి(దుబ్బాక): ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం, ఊష్ణోగ్రతల్లో పలు మార్పులు చేసుకుంటున్నాయి. తాగు నీటి వనరులతో పాటు, రైతాంగానికి సాగు నీటిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంపై పడే అవకాశాలు ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరు తడి పంటలపై దృష్టి సారించాలని రైతులకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రానున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యాసంగి సాగులో వరి సాగుకు బదులు ఆరుతడి పంటలను సాగు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందించడానికి సమాయత్తం అవుతోంది. ఆరుతడి సాగుకు సమాయత్తం అయ్యే రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై అందించే వ్యవసాయ పరికరాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సబ్సిడీపై అందించే పరికరాలు
డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, మల్చింగ్ షీట్లు, కూరగాయల సాగుకు అవసరమైన పందిళ్లు (పండాల్ప్), సోలార్ ఫెన్సింగ్, వివిధ రకాల విత్తనాలను సబ్సిడీ ద్వారా పొందవచ్చు.
యాసంగిలో ఆరుతడి సాగుకు సిద్ధమమ్యే రైతులు సబ్సిడీలో లభించే వ్యవసాయ పరికరాలకు దరఖాస్తు చేసుకోవడానికి పట్టాదారు పాసు బుక్‌తో పాటు ఆధార్ కార్డు, ఫొటో, బ్యాంక్ ఖాతా ధ్రువ పత్రాలను వ్యవసాయ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.


