వైద్యసేవలు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలు పట్టవా?

Nov 11 2026 9:28 AM | Updated on Nov 11 2026 9:28 AM

సిద్దిపేటకమాన్‌: ‘సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు అధ్వానంగా మారాయి. సిరంజీలు లేవు.. కుట్లు వేసే దారాలూ లేవు.. విధులను నిర్వర్తించడంలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1000 వెయ్యి కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని హరీశ్‌రావు మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చాలా మంది డాక్టర్లు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి ఆస్పత్రిలో లేకపోవడం చూసి విస్మయానికి గురయ్యారు. ఒక డాక్టర్‌ ఏకంగా రేపటి సంతకం ముందే చేయడాన్ని పరిశీలించి వైద్యాధికారులను ఆరా తీశారు. అనంతరం ఫార్మసీ, మెటర్నిటీ వార్డు, ఆర్థోపెడిక్‌, పిడియాట్రిక్‌ తదితర వార్డులను తనిఖీ చేసి చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడారు. అనంతరం ఆస్పత్రిలో వైద్యాధికారులతో హరీశ్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా పనితీరుపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30గంటలకు ఆస్పత్రికి వస్తే ఆర్థోపెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌సర్జరీ, రేడియాలజీ, ఆప్తమాలజీ, డెంటల్‌ సర్జరీ వంటి కీలక విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్‌, సీనియర్‌ డాక్టర్‌ డ్యూటీలో లేరని, పిడియాట్రిక్‌లో ఒక్కరే ఉన్నారని, గైనకాలజిస్టులు అందుబాటులో లేరని అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్ల బాధ్యతారాహిత్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రికి వచ్చే పెషేంట్ల సంఖ్య పడిపోయిందన్నారు. కేసీఆర్‌ హాయాంలో మెడికల్‌ కళాశాల తెచ్చి 600బెడ్లతో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 318మంది డాక్టర్లకు 301మంది ఇన్‌ పెషేంట్లు మాత్రమే ఉన్నారన్నారు.

వెయ్యి పడకల ఆస్పత్రి మూడేళ్లుగా మూలకే..

90శాతం పూర్తి చేసిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆస్పత్రిని కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి మూడేళ్‌లైనా మూలకు పడేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఇందులో సిద్దిపేటకు రూ.30కోట్లు పెండింగ్‌లో పెట్టిందన్నారు. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఆస్పత్రిలో మందులు, సర్జికల్‌ పరికరాలు కొనుగోలు చేయలేక సర్జరీలు ఆగిపోతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో కనీసం సిరంజీలు, కుట్లు వేసే దారాలు కూడా లేని దుస్థితి నెలకొందన్నారు. కేసీఆర్‌ కిట్‌ సమయంలో ముగ్గురు డాక్టర్లతో 450 డెలివరీలు జరిగితే నేడు 35మంది గైనకాలజిస్టులున్నా 350 డెలివరీలు కూడా దాటని పరిస్థితి ఉందన్నారు. ఆర్థోపెడిక్‌లో చిన్న సర్జరీకి ఐదు రోజులు పడిగాపులా అంటూ..ఇకపై 24గంటల్లో సర్జరీలు జరగాలని ఆదేశించారు. ప్రతి నెల ఆసుపత్రిపై రివ్యూ చేస్తానని, ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు డాక్టర్లు డ్యూటీలో ఉండాల్సిందేనని హరీశ్‌రావు ఆదేశించారు.

రేవంత్‌ పాలనలో పడకేసిన వైద్యం

సిరంజీలు .. కుట్లు వేసే దారాలూ లేవు

వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా విధుల నిర్వహణ

మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement