రైతులు అధైర్యపడొద్దు
అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్
సిద్దిపేటరూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రతీ గింజా కొంటామని, రైతులు అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు కేంద్రానికి తీసుకువచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అని బాలల సంరక్షణ జిల్లా అధికారి రేష్మ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చంద్లాపూర్‌లో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి, అవగాహన కల్పించారు. పిల్లలను పనుల్లో పెట్టకుండా పాఠశాలలకు పంపించాలన్నారు, బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. గ్రామానికి వలస వచ్చిన కుటుంబాల పిల్లలను కూడా బడిలో చేర్పించాలన్నారు. లింగ వివక్ష చూపవద్దన్నారు. లాంగిక వేధింపులు, మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు సంబంధిత సహాయ కేంద్రాలకు సమాచారం ఇవ్వాలన్నారు.
సిద్ధిపేటజోన్: జిల్లా కేంద్రంలోని పలు సూపర్ మార్కెట్లలో మంగళవారం జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రత్నదీప్, మోర్, నేషనల్ మార్ట్, రాజరాజేశ్వర రైస్ డిపో, శేషాద్రి రైస్ డిపోల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూకం విషయంలో తేడాలు గమనించి షాపులపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి బ్రహ్మారావు, తూనికలు కొలతల శాఖ అధికారి శివరంజని తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్: ఢిల్లీ సాహిత్య సదస్సుకు హాజరుకావాలని హుస్నాబాద్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత, జన జాగృతి వ్యవస్థాపకుడు ముక్కెర సంపత్ కుమార్‌కు ఆహ్వానం అందింది. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న జాతీయ సదస్సులో సంపత్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొనేందుకు అంతర్జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ప్రత్యేక ఆహ్వానం అందించారు.
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో బుధవారం నుంచి ఎనిమిది రోజుల పాటు క్రికెట్ సందడి నెలకొననుంది. కరీంనగర్, సిద్దిపేట వేదికగా ఎనిమిది రోజుల పాటు మహిళా క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల11 నుంచి 18వరకు టీ20 మహిళా క్రికెట్ టోర్నీలో సుమారు 120 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. 8 డే మ్యాచ్‌లు కాగా మరో 6 నైట్ మ్యాచ్‌లు సాగనున్నాయి. ఫ్లడ్ లైట్ వెలుగులో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఏర్పాట్లను టీ20 చైర్మన్ ఆగమ్‌రావు పరిశీలించారు. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడం కోసం టోర్నీ ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మల్లికార్జున్ పేర్కొన్నారు.


