హోదా మాటున అహంకారం
● ‘నువ్వింకా బతికే ఉన్నావా?’: మొన్న గజ్వేల్ తహసీల్దార్ ● ‘మంగనీ పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి’: నిన్న సిద్దిపేట రూరల్ అధికారి ● అధికారుల దురుసు ప్రవర్తనపై సర్వత్రా దుమారం ● ప్రజాసంఘాల ఆగ్రహం
బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు.. బాధ్యతను విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సామాన్యులకు అండగా నిలవాల్సిందిపోయి, వారిని కించపరిచేలా, మానసిక వేదనకు గురిచేసేలా మాట్లాడుతున్న ఘటనలు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్న గజ్వేల్, నిన్న సిద్దిపేట రూరల్ తహసీల్దార్ల వ్యవహారశైలిపై వస్తున్న విమర్శలు అధికార వర్గాల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. – సాక్షి, సిద్దిపేట
భూ సమస్యల పరిష్కారం కోసం గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఒక వ్యక్తిని ఉద్దేశించి.. ఏకంగా ‘నువ్వింకా బతికే ఉన్నావా? ఇంకా పురుగుల మందు తాగలేదా?’ అని రైతును ఉద్దేశించి గజ్వేల్ తహసీల్దార్ స్వామి వ్యాఖ్యానించారు. దీంతో ఈ నెల 11న తహసీల్దార్ స్వామిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం ప్రశ్నించిన రంజిత్‌కుమార్‌ను సిద్దిపేట రూరల్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ నోరుపారేసుకున్నారు. ‘మంగనీలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సిద్దిపేట ఆర్‌డీఓ సదానందం పూర్తి స్థాయిలో విచారణ చేసి రిపోర్టును కలెక్టర్‌కు గురువారం అందించారు. ఇలా జిల్లాలో పలు చోట్ల ప్రజలపై దుర్బాషలాడిన సంఘటనలు నెలకొన్నాయి.
బాధ్యత మరిచి..
భూమి రికార్డుల్లో తప్పుల సవరణ, వారసత్వ హక్కుల నమోదు, పట్టాదారు పాసుపుస్తకాల జారీ, వివిధ భూసమస్యల పరిష్కారం కోసం సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. రోజు కూలి పనులు, వ్యవసాయ పనులు పక్కనపెట్టి, ఎంతో ప్రయాసతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే వారికి కనీసం సమస్య ఏమిటో ఓపికగా విని, నిబంధనల ప్రకారం ఏం చేయాలో వివరించి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ, ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన వారే విచక్షణ కోల్పోయి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమైన విషయం. హోదా ఎంత పెద్దదైనా, ప్రజల ఆత్మగౌరవం కంటే ఎప్పటికీ గొప్పది కాదనే కనీస స్పృహను కొందరు అధికారులు గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నువ్వింకా చనిపోలేదా అంటున్న గజ్వేల్ తహసీల్దార్ స్వామి (ఫైల్)
దురుసుగా మాట్లాడుతున్న సిద్దిపేట రూరల్ తహసీల్దార్ రహమాన్ (ఫైల్)
ప్రజాసేవ ఇదేనా?
తహసీల్దార్ స్థాయి పరిధిలోని నిర్ణయాలు అనేక కుటుంబాల జీవనోపాధి, భూములు, ఆస్తులతో ముడిపడి ఉంటాయి. ఆ పదవిలో ఉన్నవారు మరింత సంయమనంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయిస్తారు కానీ, కార్యాలయాల చుట్టూ తిరిగి అవమానాలు ఎదుర్కోవడానికి కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మాటతీరు, స్పందన, నిర్ణయాల్లో పారదర్శకతే ప్రభుత్వ పాలనకు అసలైన గీటురాయి కావాలి. ప్రజలతో మర్యాదగా మాట్లాడటం అధికారులకు ఏదో అదనపు బాధ్యత కాదు.. వారి విధి నిర్వహణలో అత్యంత ముఖ్యమైన భాగంగా భావించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.. సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
జవాబుదారీగా ఉండాలి
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారి అహంకార పూరితంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు. అధికారులు ఏ హోదాలో ఉన్నా కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మర్యాద ఇవ్వడంతోపాటు సమస్యలకు పరిష్కారం చూపాలి. అధికారుల పనితీరు పై ఎప్పటికప్పుడు నిఘా ఉండే విధంగా పౌరసమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.
– పోచబోయిన శ్రీహరి యాదవ్,
సామాజిక ఉద్యమ నాయకులు
చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ అధికారులు ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అధికార దర్పంతో దురుసుగా మాట్లాడడం సరికాదు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే. ఇలాంటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– వరుకోలు రాజలింగం,
సీనియర్ న్యాయవాది, సిద్దిపేట


