● అడుగంటిన ఊట బావులు.. ఆగిన బోర్లు ● బీడువారిన సాగు భూములు ● నీటి కొరతతో యాసంగి సాగు గగనమే ● హుస్నాబాద్‌ను కరువు ప్రాంతంగా గుర్తించకపోవడంతో రైతుల్లో ఆవేదన
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో ప్రాజెక్టులు లేవు. కెనాల్ కాల్వల్లో నీరు రాదు. వానలు పడితేనే పంటలు. ఊట బావులు, బోరు బావుల ఆధారంతోనే రైతులు పంటలు సాగు చేస్తారు. మెట్ట ప్రాంతంలో వరద కాల్వల కోసం ఉద్యమాలు చేస్తే 2004లో వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత 2007లో గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్లకు పునాదులు వేశారు. చకచక పనులు జరుగుతున్న క్రమంలో మహానేత మరణం తర్వాత అక్కడే అగిపోయాయి. 70 ఏళ్ల సాగు నీటి కష్టాలు కలలుగానే మిగిలిపోయాయి. 2012 వరకు పంటల సాగులో నష్టాలను చూసిన రైతులు ప్రత్యేక రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడటంతో సాగు నీరుకు కొరత లేకుండా వ్యవసాయం సాగిపోయింది.
1.25 లక్షల ఎకరాల్లో సాగు..
హుస్నాబాద్ డివిజన్‌లో 1.25 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారు. 2026 వానాకాలంలో వానలు లేక రైతులు పంటలు సాగు చేయడానికి వెనుకడుగు వేశారు. సెప్టెంబరు నెలలో 372.4 మి.మీటర్ల వర్షం కురువడంతో రైతులు ఆలస్యంగా పంటలు సాగు చేసినా నీళ్లు లేక ఎండిపోయాయి. హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడుగంటిన బావులు..
యాసంగి సీజన్ ప్రారంభంలో మీటరు లోతులో ఉండే భూగర్భ జలాలు ఇప్పుడే 18 మీటర్ల అడుగున చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి పంట వేస్తే మొదటి మడికే నీరు అందే పరిస్థితి లేకపోవడంతో సాగు పై ఆశలు వదులుకున్నారు. నీటి కష్టాలు, కరెంట్ కోతలతో వ్యవసాయం చేయలేమని రైతులు చెబుతున్నారు. మరోవైపు పశువులకు మేత దొరకని పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు.


