ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయ్ మల్లన్నసాగర్ కట్ట దెబ్బతింటోంది మాజీ మంత్రి హరీశ్‌రావుతో తిప్పారం గ్రామస్తుల ఆవేదన మల్లన్నసాగర్ వద్ద జరుగుతున్న బ్లాస్టింగ్ల పరిశీలన
గజ్వేల్/కొండపాక: మల్లన్నసాగర్ నుంచి మూసీ సుందరీకరణకు నీటిని తరలించే పనుల కోసం చేపడుతున్న బ్లాస్టింగ్లతో భయం భయంగా కాలం గడుపుతున్నామని కుకునూర్‌పల్లి మండలం తిప్పారం గ్రామస్తులు మాజీ మంత్రి హరీశ్‌రావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బ్లాస్టింగ్లను హరీశ్‌రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్లు బక్కి వెంకటయ్య, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సాయిలు, శంభులింగం, బాలయ్యతోపాటు పలువురు అభిప్రాయాలను తెలుసుకున్నారు. బ్లాస్టింగ్ల వల్ల మల్లన్నసాగర్ కట్ట క్రమంగా దెబ్బతింటున్నదని, లీకేజీలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన హరీశ్‌రావు మాట్లాడుతూ తిప్పారం గ్రామంలో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందించి కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నారు.
అనుమతుల్లేకుండా బ్లాస్టింగ్లా?
ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులేకాకుండా, గ్రామపంచాయతీ అనుమతి లేకుండా బ్లాస్టింగ్లను ఎలా చేపడతారని కాంట్రాక్ట్ ఏజెన్సీకు చెందిన సైట్ ఇంజినీర్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. 40 మీటర్ల ఎత్తులో మల్లన్నసాగర్ కట్టకు 400మీటర్ల దూరంలో బ్లాస్టింగ్లు చేపట్టాలని తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఇష్టానుసారంగా పనులు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. మల్లన్నసాగర్ భద్రత చర్యలు చేపట్టే వరకు పోరాటం చేస్తామన్నారు. ఇకపోతే పైప్‌లైన్ నిర్మాణ పనుల కోసం రైతుల వద్ద సేకరించి భూములకు సైతం అతి తక్కువ పరిహారం అందించి అన్యాయం చేశారని, ఈ అంశంపైనా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తిప్పారం సర్పంచ్ భద్రప్ప, గజ్వేల్ మార్కెట్ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు నూనె కుమార్, ప్రశాంత్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.


