● ‘చిన్న’బోతున్న పోషకాహార పంపిణీ లక్ష్యం
● పట్టించుకోని అధికారులు
సిద్దిపేటరూరల్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడి గుడ్డు చిన్నబోతోంది. బాలింతలు, పసికందులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న కోడి గుడ్లు చిన్న సైజులో దర్శనమిస్తుండటం గమనార్హం. గుత్తేదారు ఇష్టారీతిగా సరాఫరా చేయడంతో పూర్తిగా పిట్టగుడ్లను తలపించేలా పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల మేరకు గుడ్లను సరాఫరా చేయాల్సిన గుత్తేదారు తక్కువ పరిమాణం, బరువు కలిగిన గుడ్లను సరాఫరా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఎప్పటికప్పడు పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో గుత్తేదారుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న లబ్ధిదారులు చేసేదేమి లేక విచారం వ్యక్తం చేస్తూ నిర్వాహకులు ఇచ్చిన గుడ్లను తీసుకుంటున్నారు.
గుత్తేదారు ఇష్టారాజ్యం
గుత్తేదారు వివిధ పరిమాణాల్లో గుడ్లు పంపిణీ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అంగన్వాడీ కేంద్రాలకే కాదు పాఠశాలలకు కూడా ఇలాంటి గుడ్లనే అందజేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, విద్యార్థులకు పోషకాహారం అందించడంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. సాధారణంగా మార్కెట్‌లో బరువు, పరిమాణం తక్కువగా ఉన్నవాటిని ఎవరూ తీసుకోరు. అలా వేరు చేసిన గుడ్లను తక్కువధర కు కొనుగోలు చేసి వాటిని అంగన్‌వాడీ కేంద్రాలకు అంటగడుతున్నారు. పలుమార్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరాఫరా చేసిన గుడ్లు కుళ్లిపోయిన ఘటనలు ఉన్నాయి.
లక్ష్యానికి తూట్లు..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు పోషకాహారం అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గుడ్లు పంపిణీ చేస్తోంది. పంపిణీలో అక్రమాలు, అధికారుల పర్యవేక్షణ లేమితో పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందడంలేదు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గుడ్లను టీచర్‌తో పాటుగా, సూపర్‌వైజర్ పరిశీలించి దిగుమతి చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కోటి కచ్చితంగా 45 గ్రాములు ఉండాలి. ఒక ట్రేలో సుమారు 30 గుడ్లు ఉంటాయి. ట్రే బరువు మినహాయిస్తే కిలోన్నర బరువు రావాలి. కాని ఒక్కో గుడ్డు 30 నుంచి 40 గ్రాములు మాత్రమే ఉంటున్నాయి. నెలకు రెండు నుంచి మూడు సార్లు గుత్తేదారు వీటిని పంపిణీ చేస్తున్నారు.


