● 150మందికి ముగ్గురే హాజరు
● ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల దుస్థితి
● సెలవుల అనంతరం మరమ్మతులు చేపడుతుండటమే కారణం
హుస్నాబాద్: విద్యార్థులతో సందడిగా ఉండాల్సిన గిరిజన ఆశ్రమ పాఠశాల బోసిపోయి కనిపిస్తోంది. పాఠశాలలో టాయిలెట్ల మరమ్మతులు చేపడుతుండటంతో విద్యార్థులు పాఠశాలకు రావడం లేదు. దసరా సెలవుల నుంచి ఇప్పటి వరకు ఇంటిపట్టునే ఉంటున్న దుస్థితి. హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 150 విద్యార్థులు ఉన్నారు. దసరా సెలవుల అనంతరం ఈ నెల 23 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించారు. అయినా విద్యార్థులు ఎవరూ హాస్టల్‌కు రాలేదు. హాస్టల్‌లో ఉన్న 11 టాయిలెట్లు పని చేయకపోగా వాటి మరమ్మతుల కారణంతో విద్యార్థులు రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బుధవారం కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. మొత్తం 12 మంది ఉపాధ్యాయులకు గాను ఇద్దరు డిప్యూటేషన్ పై వెళ్లగా, మరొకరు ఇటీవలనే ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం ఏడుగురు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాగా, ఇద్దరు ఉపాధ్యాయులు లీవ్‌లో ఉన్నారు.
బోసిపోయిన హాస్టల్
ప్రస్తుతం హాస్టల్ బోసిపోయింది. దసరా సెలవుల అనంతరం టాయిలెట్ల మరమ్మతులు ప్రారంభించారు. టాయిలెట్ల మరమ్మతులు జరుగుతున్నాయని, పూర్తి అయ్యే వరకు ఎవరూ హాస్టల్‌కు రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. మరమ్మతులు దసరా సెలవుల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా, పాఠశాల పునః ప్రారంభం రోజు నుంచి ప్రారంభించడంతో విద్యార్థులు హాజరుకాని పరిస్థితి. విద్యార్థులకు మెనూ ప్రకారం అందించే ఫుడ్ ఇచ్చినట్లు రాస్తున్నారా? లేదా? అనేది అనుమానమే. సకాలంలో టాయిలెట్లను పూర్తి చేయకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? ప్రభుత్వ వైఫల్యమా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై ఫోన్ ద్వారా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనాఽఽథ్‌ను వివరణ కోరగా టాయిలెట్లు మరమ్మతుల కారణంగా విద్యార్థులు పాఠశాలకు రావడం లేదన్నారు. అందరికీ ఫోన్లు చేసి రప్పిస్తున్నామని తెలిపారు. బుధవారం నుంచి ఒక్కొక్కరుగా వస్తున్నారని. గైర్హాజరైన రోజుల్లో విద్యార్థుల సంఖ్యను జీరోగానే చూపిస్తున్నామని చెప్పారు.


