మీడియాకు నో ఎంట్రీ
ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంది.. టెర్మినేట్ చేస్తా..
సుదీర్ఘ చర్చ..
ఆసక్తికరంగా ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష
సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు
కొందరు తహసీల్దార్లు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఉన్నాయని, వీరు తమ తీరు మార్చుకోకపోతే సస్పెండ్‌తో సరిపెట్టకుండా ఏకంగా టెర్మినేట్ చేస్తామని పొంగులేటీ హెచ్చరించారు. 22ఏ, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, భూముల రీసర్వే తదితర రెవెన్యూ అంశాలపై సమీక్ష సందర్భంగా రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తక్షణం తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల వివరణలతో ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశం ఆసక్తికరంగా సాగింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ తదితర శాఖల అంశాలపై మంగళవారం సంగారెడ్డి జెడ్పీ సమావేశం హాలులో కీలక సమావేశం జరిగింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌తో కలిసి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. భూములు సర్వే.. ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి.. భూసమస్యల పరిష్కారం.. ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి సమస్యలు వంటి అంశాలను చర్చించారు. సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్, రిజిస్ట్రేషన్లశాఖ స్పెషల్ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హన్మంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, ఎంపీలు సురేష్‌షెట్కార్, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతప్రభాకర్, మాణిక్‌రావు, సంజీవరెడ్డి, మూడు జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కోటాపైనా..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేసే అధికారాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా కోటా కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమీక్షలో డిమాండ్ చేశారు. కనీసం 40 శాతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్నారు. ఇందుకు మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ప్రతి భూ యజమానికి భూధార్: పొంగులేటి
ప్రతి భూ యజమానికి భూదార్ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్లతో కూడిన ఉపగ్రహ చిత్రాలతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామన్నారు. ఒక్కో జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూసర్వే చేపట్టామన్నారు. పక్షం రోజుల్లో డబుల్బెడ్రూం ఇండ్ల కేటాయింపులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ల్యాండ్ సీలింగ్ యాక్టును పకడ్బందీగా అమలు చేయాలి: ఎమ్మెల్సీ
ల్యాండ్ సీలింగ్ యాక్టును పకడ్బందీగా అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి సమీక్షలో డిమాండ్ చేశారు. డబుల్బెడ్రూం గృహాలను స్థానికంగా నివాసం ఉండే వారికే కేటాయించాలని మంత్రుల దృష్టికి తెచ్చారు.
వెయ్యి ఎకరాలు లాక్కున్నారు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
జిల్లాలో టీజీఐఐసీ పేరుతో నిరుపేదలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాలు లాక్కున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ సమీక్ష సమావేశంలో విమర్శించారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముంబై హైవే పనులను వేగవంతం చేయాలని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
హాజరైన మంత్రులు పొంగులేటి, దామోదర, వివేక్
సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ప్రతి విమర్శలు చేసిన మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
పాల్గొన్న వివిధ శాఖల ఉన్నతాధికారులు
మూడు జిల్లాల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఈ కీలక సమీక్షా సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ కార్యకర్తలు, చోటామోటా నేతలను, అధికారిక వ్యక్తులు కూడా సమీక్ష హాలులోకి అనుమతించడం గమనార్హం. సర్కారు వైఫల్యాలు వెలుగులోకి వస్తాయనే అంతర్గత సమీక్ష నిర్వహించారని బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు విమర్శించారు.
ఎల్‌నినోపై చర్చకు విపక్షాలు పట్టు..
సమీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎల్‌నినో కరువు అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. రివీట్మెంట్ పనుల పేరుతో సింగూరు ప్రాజెక్టు నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని నదిలోకి వృఽథాగా వదిలేశారని విమర్శించారు. ఇప్పటికే తాగునీటి సమస్య షురువైందని పలువురు ఎమ్మెల్యేలు సమావేశం దృష్టికి తెచ్చారు.


