● కొమురవెల్లిలో తీవ్రం
● మరో ఏడు మండలాల్లో మధ్యస్థం
సాక్షి, సిద్దిపేట: జిల్లాపై కరవు ఛాయలు కమ్ముకున్నాయి. వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఎనిమిది మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కొమురవెల్లి మండలాన్ని తీవ్ర కరవు ప్రభావిత ప్రాంతంగా, మరో ఏడు మండలాలైన బెజ్జంకి, వర్గల్, ములుగు, మార్కుక్, చేర్యాల, నారాయణరావుపేట, దూల్మిట్ట లను మధ్యస్థ కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరువు ప్రభావిత మండలాల్లోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంతో పాటు ,వ్యవసాయ పెట్టుబడి సాయాన్ని డీబీటీ(డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా రైతుల ఖాతాల్లో జమచేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. అంతేకాకుండా తాగునీరు, పశుగ్రాసం కొరత తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, ఉపాధి పనులు కింద మరో 50రోజులు పని కల్పించనున్నారు.


