వరి కట్టడికి ఏం చేద్దాం? | - | Sakshi
Sakshi News home page

వరి కట్టడికి ఏం చేద్దాం?

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సంగాపురం యాదగిరి. ఈయనది గజ్వేల్‌. తన అర ఎకరానికిపైగా వరి పొలం పొట్ట దశలో ఉంది. లో–ఓల్టేజీ కారణంగా బోరుబావి నడవక, వరి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఆరు ట్యాంకర్లు తెప్పించుకొని నీరు పారబెట్టుకున్నాడు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.600పైగా ఖర్చు అయ్యిందని రైతు చెబుతున్నారు.

ఎల్‌నినో తీవ్రరూపం దాల్చిన వేళ.. ప్రస్తుత యాసంగిలో ‘వరి’ సాగును కట్టడి చేయడానికి ఏం చేయాలనే అంశంపై వ్యవసాయశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. గ్రామాల్లో ఇప్పటికే ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ పేరిట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులను చైతన్యపరుస్తున్నది. మరోవైపు వరి సాగును తగ్గించాలంటే విత్తనాల విక్రయాలపై నిఘా పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. –గజ్వేల్‌

జిల్లాలో ఏటా యాసంగిలో 3లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. ఇందులో సుమారు 2లక్షల ఎకరాలకుపైగా వరి సాగులోకి వస్తుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. అన్ని రకాల పంటలు కలుపుకొని కనీసం 1.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి రావడమే గగనంగా మారబోతుంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వానాకాలంలో వర్షపాతం గణనీయంగా పడిపోయింది. వానాకాలం సీజన్‌లో జూన్‌ 1నుంచి సెప్టెంబర్‌ 30వరకు 614.8మి.మీల సాధారణ వర్షపాతానికి చేరువలో వర్షపాతం కురిసిందని అధికారులు చెబుతున్నా.. చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. ప్రత్యేకించి రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంవల్ల ఈసారి చుక్కనీరు కూడా కాల్వల్లోకి వదల్లేదు. ఫలితంగా 5.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వసాయనుకుంటే కేవలం 4.47లక్షల ఎకరాలకు సాగు పరిమితమైంది. సాధారణంగా వరి ఏటా 3.85లక్షల ఎకరాల్లో సాగులోకి వస్తుండేది. కానీ 3లక్షల ఎకరాలకే పరిమితమైంది. తీవ్రవర్షాభావం, ఎక్కువ రోజులు డ్రై స్పెల్‌ కొనసాగటంతో వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు ఎండిపోయాయి. మరో విషయమేమిటంటే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాసంగిలో వరి సాగుచేస్తే నీరందే పరిస్థితులు కనిపించడం లేదు. ఈనేపథ్యంలోనే వ్యవసాయశాఖ ప్రస్తుత సీజన్‌లో గ్రామాల్లో ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ పేరిట కార్యక్రమాలను చేపడుతోంది. యాసంగికి సంబంధించి ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, ఆయిల్‌ఫామ్‌, మొక్కజొన్న, కందులు, పెసర్లు, జొన్న, రాగులు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగువైపు మళ్లాలని సూచనలు చేస్తోంది.

వరి విత్తనాల విక్రయంపై నిఘా...?

వరి విత్తనాల అమ్మకాలపై నిఘా పెడితేనే సాగును కట్టడి చేయొచ్చుననే ఆలోచనతో వ్యవసాయశాఖ ముందుకుసాగుతోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్ల తెలుస్తోంది. విత్తన డీలర్లతో రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా రైతు తన పొలంలో వరి తప్ప.. ఇతర పంటలు సాగుచేయనని, తనకు కచ్చితంగా వరి విత్తనాలే కావాలని అడిగితే... ‘సెల్ఫ్‌ డిక్లరేషన్‌’ ఫారమ్‌ నింపి విత్తనాలు తీసుకెళ్లేలా కార్యాచరణ ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వ్యవసాయశాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, అంతర్గతంగా విత్తన డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

యాసంగి కార్యాచరణకు సిద్ధమవుతున్న వ్యవసాయశాఖ

విత్తనాల విక్రయాలపై నిఘా

ఎల్‌నినో నేపథ్యంలో నిర్ణయం

ఆరుతడి పంటలవైపు మళ్లించే ప్రయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement