హుస్నాబాద్: బాలల హక్కులను కాపాడటానికి, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి పోక్సో చట్టం రక్షణ కవచమని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి అన్నారు. సోమవారం మండల న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలుర ఉన్నత పాఠశాలలో జడ్జి రేవతి, బాలికల ఉన్నత పాఠశాలలో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రమీద హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జిలు మాట్లాడుతూ బాలలపై జరిగే లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తన వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నారు. కార్యక్రమంలో న్యాయవాది కన్నోజు రామకృష్ణ, పాఠశాల హెచ్‌ఎంలు వాసుదేవ రెడ్డి, గంగిశెట్టి మహేందర్, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.
గజ్వేల్: వార్డుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన అన్నారు. సోమవారం అయిదో వార్డులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపట్టనున్న అంబేడ్కర్ భవన్ పనులకు మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డుల వారీగా సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని, దశలవారీగా వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పద్మబాయి, కౌన్సిలర్ మన్నె రూప తదితరులు పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
సిద్దిపేటరూరల్: దివ్యాంగ యువత, విద్యార్థులకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఈనెల 28న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి ప్రియాంక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇర్కోడ్‌లోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించనున్న ఈ జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌మేళాలో 5 కంపెనీలు పాల్గొననున్నాయని, పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు.
సిద్దిపేట రూరల్: బీసీ–ఏ జాబితాలో ఇతర కులాలను చేర్చవద్దని, తమ రిజర్వేషన్ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని జిల్లా బీసీ–ఏ కుల సంఘాల నాయకులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీ–ఏ జాబితాలో ఉన్న 57 కులాల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముదిరాజ్‌లను బీసీ–ఏ జాబితాలో చేర్చే అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. వెనుకబడిన కులాలకు అన్యాయం చేయవద్దని కోరారు.


