మల్లన్న ఆలయంలో పూర్ణాహుతి | - | Sakshi
Sakshi News home page

మల్లన్న ఆలయంలో పూర్ణాహుతి

Oct 21 2026 8:08 AM | Updated on Oct 21 2026 8:08 AM

మల్లన్న ఆలయంలో పూర్ణాహుతి పాలపిట్టను బంధిస్తే జైలుకే.. బాలసాహిత్య పుస్తకాల ఆవిష్కరణ ‘కాంగ్రెస్‌ బుద్ధి మార్చు తల్లీ’

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో దేవి త్రిరాత్రోత్సవాల్లో భాగంగా ఆలయ అధికారులు, అర్చకులు సొమవారం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, క్షేత్రపాలక భైరవ ఆరాధన, గణపతి పూజా, దీప పూజ, జగద్గురు పంచాచార్య ఆరాధన, నవగ్రహ దేవతారాధన తదితర ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్‌, ఏఈఓ బుద్ది శ్రీనివాస్‌, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సందీప్‌కుమార్‌

దుబ్బాకటౌన్‌: రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించడం, ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని దుబ్బాక ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సందీప్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ దసరా పండుగ నేపథ్యంలో పాలపిట్టలను పట్టుకుని ప్రదర్శించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని బీట్లలో సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. పాలపిట్ట వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రక్షిత పక్షి అని పట్టుకోవడం, కొనడం, అమ్మడం, బోనులో బంధించి ప్రదర్శించడం నిషేధమన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ఎవరైనా పాలపిట్టలను బంధించినట్లు ప్రజలకు తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రముఖ బాలసాహితీ వేత్త గరిపెల్లి అశోక్‌ రచించిన ‘తాత– మనవరాళ్లు’, ‘బల్లూకం తాత’ బాలసాహిత్య పుస్తకాలను సోమవారం జిల్లా కేంద్రంలో బాలసాహితీవేత్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న గరిపెల్లి అశోక్‌ సేవలు మరువలేనివని తెలిపారు. తెలంగాణ యాస, భాషలో బాలల కథలు రాయడమే కాకుండా పుస్తక రూపంలో అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బాల సాహితీవేత్తలు ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, బైతి దుర్గయ్య, వర్కోలు లక్ష్మయ్య, జెగ్గారి నిర్మల, సురేష్‌ పాల్గొన్నారు.

పంచాయతీ కార్మికులకు అండగా పాలకవర్గం

సిద్దిపేటఅర్బన్‌: గ్రామ పంచాయతీలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న పంచాయతీ కార్మికులకు పాలకవర్గం అండగా నిలిచింది. సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లిలో సోమవారం గ్రామపంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు రూ.15లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్‌ బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌ కిష్టయ్య మాట్లాడుతూ కార్మికుల సేవలను గుర్తించి వారికి పండుగ బహుమతిగా ఇన్సూరెన్స్‌ బాండ్స్‌, నిత్యావసర వస్తువులు అందించేందుకు పాలకవర్గం అంగీకరించడం అభినందనీయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): రైతులను ఆదుకునేలా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అమ్మవార్లును కోరారు. సోమవారం మండలంలోని తునికి నల్లపోచమ్మదేవిని దర్శించుకున్నారు. అలాగే కౌడిపల్లిలోని దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement