ధాన్యం తీసుకోం..! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తీసుకోం..!

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

కొత్త ధాన్యాన్ని కేటాయించొద్దు

క్యాప్‌ గోదాముల ఏర్పాటు

ఖరీఫ్‌ నిల్వలపై మిల్లర్ల నిరాసక్తత

మిల్లులో ధాన్యం బస్తాలు

జిల్లాలో రా రైస్‌..పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 150 ఉన్నాయి. కొంతకాలంగా ఖరీఫ్‌, రబీ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లర్లకు అప్పగించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ధాన్యం పక్కదారి పడుతోందని, అక్రమాలు చోటు చేసుకున్నాయని, సీఎంఆర్‌ బకాయిలు పేరుకుపోయిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ తనిఖీలు జరిగాయి. ఈ నేపథ్యంలో మిల్లర్లు సమ్మె బాట పట్టారు.

కేటాయింపులు వద్దని లేఖ!

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సేకరించిన ధాన్యం కేటాయింపులు వద్దని జిల్లా రైస్‌మిల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సీజన్లకు సంబంధించి ధాన్యం నిల్వలు అలాగే ఉన్నాయని, మిల్లింగ్‌ చేయడానికి స్థలం లేకపోవడం, నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండిపోయిన దృష్ట్యా ధాన్యం నిలువ సమస్యగా ఉంటుందని ఖరీఫ్‌, 2026–27 సీజన్‌ కొత్త ధాన్యాన్ని జిల్లాలోని మిల్లులకు కేటాయించవద్దని కోరుతూ లేఖ రాయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ప్రత్యామ్నాయ బాటలో యంత్రాంగం..

మరోవైపు ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు జిల్లా యంత్రాంగం అనువైన గోదాముల అన్వేషణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు గోదాములను గుర్తించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గోదాములు, స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, సహకార సంఘాలకు చెందిన గోదా ములతోపాటు అవసరమైన ప్రాంతాల్లో క్యాప్‌ గోదాముల ఏర్పాటు ఆలోచనలో యంత్రాంగం ఉంది.

ఓ వైపు జిల్లాలో రైస్‌మిల్లులు మూత పడ్డాయి. మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌ పంట మరికొద్ది రోజుల్లోనే చేతికి రానుంది. జిల్లాలో యంత్రాంగం ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు కసరత్తు చేస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వ అంశంపై ఇటు మిల్లర్లు..అటు ప్రభుత్వాధికారులు అంతర్గతంగా సమాలోచనలు చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో జిల్లాలో మిల్లర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఖరీఫ్‌ 2026–27 ధాన్యం కేటాయింపులు చేయొద్దని విజ్ఞప్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో సమ్మె ప్రభావం దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ ధాన్యం నిల్వల కోసం గోదాముల అన్వేషణలో యంత్రాంగం సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.

– సిద్దిపేటజోన్‌

జిల్లాలో ప్రస్తుతం 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ప్రస్తుతం గోదాముల్లో నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండిపోయింది. దీంతో మిల్లు నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఖరీఫ్‌ 2026–27 సీజన్‌ కొత్త ధాన్యం కేటాయింపులు వద్దని రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించనున్నాం.

– కొమరవెల్లి చంద్రశేఖర్‌. జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు

అవసరమైతే క్యాప్‌ గోదాముల ఏర్పాటు ఆలోచనలో ఉన్నాం. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం నిలువ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్‌ కమిటీ గోదాములు, ఎస్‌డబ్ల్యూసీ గోదాములతోపాటు ప్రైవేటు గోదాముల గుర్తింపు ప్రక్రియ త్వరలోనే చేపడతాం.

– తనూజ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

ప్రభుత్వానికి లేఖలు రాసే యోచనలో మిల్లర్లు

ధాన్యం నిల్వల గోదాం అన్వేషణలో సర్కార్‌

ప్రత్యామ్నాయ బాటలో యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement