గవర్నర్ చేతుల మీదుగా
రూ.2 లక్షలు అందజేత
నంగునూరు(సిద్దిపేట): పదో తరగతి పరీక్షలో సిద్దిపేట జిల్లా టాపర్‌గా నిలిచిన నర్మేట విద్యార్థి అమూల్యారెడ్డికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్‌శుక్లా చేతుల మీదుగా నగదు బహుమతి అందజేశారు. నంగునూరు మండలం వెంకటాపూర్‌కు చెందిన రైతు మాధవరెడ్డి, లలిత కూతురు పదో తరగతిలో 587 మార్కులు సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి టాపర్లను సన్మానించిన విద్యార్థులకు గురువారం హైదరాబాద్‌లో శ్రీరా మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఇందులోభాగంగా జిల్లా విద్యార్థి అమూల్యరెడ్డికి గవర్నర్ రూ.2 లక్షలు అందజేశారు. విద్యార్థి నగదు ప్రోత్సాహకాన్ని అందుకోవడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ సేవలు మరువలేనివని ఎంపీ రఘునందన్‌రావు కొనియాడారు. దీన్‌దయాళ్ జయంతి సందర్భంగా శుక్రవారం గజ్వేల్‌లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త దీన్‌దయాళ్ దేశాభివృద్ధికి తనదైన శైలిలో సేవలందించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్: బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు బాల వికాస వాటర్ ప్లాంట్ ఫెడరేషన్ (బీవీడబ్ల్యూపీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంట్లను ఆయన శుక్రవారం సందర్శించారు. లింగమూర్తి మాట్లాడుతూ...యంత్ర పరికరాల లోపాలతో పని చేయని ప్లాంట్లను గుర్తించి, వాటికి త్వరిగతిన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అవసరమైన గ్రామాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు.
హుస్నాబాద్: భావి తరాల కోసం వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహించిన జిల్లా టూరిజం క్లబ్ పోటీల్లో తృతీయ బహుమతి పొందిన కళాశాల విద్యార్థులను అభినందించారు. హుస్నాబాద్ పరిసర ప్రాంతాల చారిత్రక, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలపై విద్యార్థులు వీడియో చిత్రీకరించినందుకు ఈ పోటీల్లో బహుమతి అందుకున్నారు.


