ట్రీగార్డ్సు లేక పశువులకు మేతగా నాటిన మొక్కలు పెరిగిన చెట్లను నరికేస్తున్న విద్యుత్ సిబ్బంది నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
మంత్రులు నాటినా..
హుస్నాబాద్: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నానుడితో గ్రామాలు, పట్టణాలు పచ్చదనం వెల్లివిరియాలనేది ప్రభుత్వ సంకల్పం. ఆ సంకల్పం రోజులు కూడా ఉండటం లేదు. మొక్కల లెక్క కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయికి వెళితే మచ్చుకై నా మొక్కలు కనపడని పరిస్థితి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలంలో వచ్చిందంటే ఊరూరా మొక్కలు, ఇంటింటికీ మొక్కలు పంచుతూ పర్యావరణ పరిరక్షణకు నడుంబిగిస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో, రహదారుల వెంబడి, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటుతున్నా, వాటిని సంరక్షించకపోవడంతో అనుకున్న లక్ష్యం నీరుగారుతున్న పరిస్థితి.
40 వేల మొక్కలు లక్ష్యం
పట్టణంలో 40 వేల మొక్కలు నాటాలని అధికారులు నిర్దేశించారు. ఈ మొక్కలు బయటి ప్రాంతాల నుంచి తెచ్చేందుకు రూ.30 లక్షల టెండర్‌ను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. ఈ నిధులతో మొక్కలు బయట నుంచి తేవడం, మొక్కలు నాటడం, రవాణా ఖర్చు, ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బయట నుంచి తెచ్చిన మొక్కలే కాకుండా నర్సరీ పెంచిన మొక్కలను కూడా పంపిణీ చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం వార్డుల వారీగా 25వేలకు పైగా పూలు, పండ్ల మొక్కలు ఇంటింటికీ పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. ఖాళీ ప్రదేశాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే మొక్కల చుట్టూ ట్రీగార్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు.
పర్యవేక్షణ కరువు.
నాటిన మొక్కలను కాపాడటంలో అందరూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొక్కలు నాటిన తర్వాత పట్టణంలో చాలా వరకు రోడ్లకిరువైపులా విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటడం, మరోవైపు చెట్ల కొమ్మలు వైర్లను తాకుతున్నాయని విద్యుత్ అధికారులు పూర్తి తొలగించడం పరిపాటిగా మారుతోంది. వర్షాకాలం మినహా మిగతా సీజన్‌లో మొక్కల సంరక్షణపై శ్రద్ధ చూపకపోవడంతో అవి ఎండి పోతున్నాయి. మొక్కల చుట్టూ ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయకపోవడంతో వాటిని పశువులు మేస్తున్నాయి. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
మొక్కలపై కొరవడిన పర్యవేక్షణ
ట్రీగార్డ్స్‌ను దొంగిలిస్తున్నారు
మొక్కల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రీగార్డ్స్‌లను కొంతమంది దొంగిలిస్తున్నారు. ఇంటింటికీ ఎక్కువ మొక్కలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతీ ఇంటికి పూలు, పండ్ల మొక్కలు ఎక్కువ మొత్తంలో పంపిణీ చేశాం. పరిమితి సంఖ్యలో పెద్ద మొక్కలను ఖాళీ ప్రదేశాలు, స్కూల్, కళాశాలల్లో నాటాం. ప్రతీ ఒక్కరు మొక్కను నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యతను తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.
– పృథ్వీ, మున్సిపల్ ఏఈ, హుస్నాబాద్
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో 07.07.2025న వన మహోత్సవం సందర్భంగా తమ తల్లుల పేరిట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హైమావతి కలిసి మొక్కలు నాటారు. ప్రస్తుతం వారు నాటిన మొక్కలు ఎండిపోయి, ట్రీగార్డులు పడిపోయిన పరిస్థితి నెలకొంది.


