విద్య పరిరక్షణకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

విద్య పరిరక్షణకు ఉద్యమించాలి

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

గజ్వేల్‌: నాణ్యమైన ప్రభుత్వ విద్య కోసం పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని విద్యా కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఆకునూరి మురళి పేర్కొన్నారు. ‘ప్రైవేటు బడుల ఫీజుల నియంత్రణ–ప్రభుత్వ బడుల బలోపేతం’, ‘బడ్జెట్‌లో విద్యకు 18%’బడ్జెట్‌ కేటాయించాలనే డిమాండ్‌తో తెలంగాణ పీఫుల్స్‌ ఫ్రంట్‌(టీపీఎఫ్‌) ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం గజ్వేల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని టీపీటీఎఫ్‌(తెలంగాణ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌) కార్యాలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో బస్సుయాత్రకు నేతృత్వం వహిస్తున్న ఆకునూరి మురళి మాట్లాడుతూ... తెలంగాణలో విద్యా వ్యవస్థ నేడు ఆందోళనకరమైన స్థితిలో ఉందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులపై నియంత్రణలేక ప్రజలు ఎంతో నష్టపోతున్నారని, రాజ్యాంగం విద్యను హక్కుగా చెబితే...నేడు మార్కెట్‌లో కొనుగోలు వస్తువుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎంవీ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో 74శాతంమంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారని ఇది ప్రభుత్వ పాఠశాలలపై తగ్గుతున్న విశ్వాసాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, తెలంగాణ పీపుల్స్‌ ఫ్రంట్‌ కోర్‌ కమిటీ సభ్యులు కుమార్‌, టీపీటీఎఫ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రం, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్‌, టీపీటీఎఫ్‌ నాయకులు బీ.రాజులు, నరేందర్‌, జె.శ్రీనివాస్‌, నాగరాజు, విద్యాసాగర్‌, పి.ఎల్లయ్య, సీపీఐ నాయకులు దయానందరెడ్డి, రాజేశం, డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఏ.గొండస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా బస్సుయాత్ర గురువారం రాత్రి జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌ హైస్కూల్‌ ప్రాంగణానికి చేరుకుని...అక్కడే నిద్రించాల్సి ఉంది. కానీ విద్యాశాఖ అధికారులు అనుమతి నిరాకరించడంతో అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వరండాలో పడుకుని శుక్రవారం గజ్వేల్‌కు చేరుకున్నారు.

విద్యా కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఆకునూరి మురళి

గజ్వేల్‌కు చేరుకున్న తెలంగాణ టీపీఎఫ్‌ బస్సు యాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement