● రాహుల్‌గాంధీపై కేసులు సరికాదు ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దేశాన్ని అభివృద్ధి చేయమని అడిగినందుకు ప్రతిపక్షాలపై అక్రమ చార్జ్‌షీట్‌లు నమోదు చేయడం ఎన్‌డీఏ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీపై చార్జ్‌షీట్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట పార్టీ కార్యాలయ ఆవరణలో పలువురు నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ కుటుంబం దేశాభివృద్ధి కోసం తమ ప్రాణాలు అర్పించిందన్నారు. దేశాభివృద్ధిలో గాంధీ కుటుంబం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. అలాంటి వారిపై అక్రమంగా కేసులు బనాయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నెండేళ్లుగా దేశంలో అభివృద్ధి కుంటుపడిందని వాపోయారు. మునిగిపోతున్న అదానీకి రుణమాఫీచేసి కాపాడిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. గుజరాత్ వ్యాపారులకు రాయితీలు ఇచ్చి, వారి అభివృద్ధే దేశాభివృద్ధిగా పరిగణించడం ఏమి టని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన పనికి ఆహారం పథకం పేరు మార్చి పనిదినాలను తగ్గించారని, దీంతో పేద ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
సిద్దిపేటజోన్: ఉత్తరాఖండ్‌లో రాహుల్ గాంధీపై అక్రమ కేసు, ఎఫ్‌ఐఆర్ నమోదును నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ... రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. వెంటనే ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


