● ‘జలసిరి’పై నిర్లక్ష్యం తగదు ● కలెక్టర్ హైమావతి ● అధికారులతో కలెక్టర్ జూమ్ సమావేశం
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వనమహోత్సవం, జలసిరి, ఇందిరమ్మ ఇళ్లు, పలు రకాల అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో జూమ్ సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సం కార్యక్రమంలో భాగంగా 17లక్షల 60వేల మొక్కలకు గాను 14 లక్షల 63వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. మరిన్ని రోజుల్లో వందశాతం మొక్కలు నాటి జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు. జలసిరిలో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టడం కోసం చేపట్టిన పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేంది లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల వద్ద తప్పకుండా వర్షపు నీటిని ఒడిసి పట్టే కార్యక్రమం చేపట్టాలన్నారు. మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో పూర్తయిన వాటిని ఈనెల 15లోపు గృహ ప్రవేశాలు జరిగేలా పనిచేయాలన్నారు. చేయూత పెన్షన్లు అందించేందుకు గాను పరిశీలన పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జి డీఆర్‌డీఓ రమేశ్, డీపీఓ రవీందర్, పీఆర్ ఈఈ శ్రీనివాస్, మిషన్‌భగీరథ ఈఈ, హౌసింగ్ పీడీ భగవంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
1,11,223 మందికి ‘సర్’ నోటీసులు..
జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్‌లో ‘ఎస్‌ఐఆర్’లో భాగంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 1,175 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఓటరు జాబితా ప్రకారం 4,28,861 మంది పురుషులు, 4,45,273 మంది మహిళలు, 47 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండగా మొత్తంగా 87,4181 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సర్ ప్రక్రియలో 2,26,433 మంది నోటీసులు జనరేట్ చేసి 1,11,223 మందికి అందించినట్లు తెలిపారు. సర్ ప్రక్రియలో అభ్యంతరాలు, వినతులు స్వీకరించేందుకు ఈనెల 5, 6వ తేదీల్లో , తిరిగి 12, 13 తేదీల్లో పోలింగ్ కేంద్రాల ప్రత్యేక ప్రచార దినోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతీ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


