పన్ను వసూళ్లలో చతికిలబడి.. | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లలో చతికిలబడి..

Aug 19 2026 9:04 AM | Updated on Aug 19 2026 9:04 AM

మున్సిపాలిటీలకు గ్రోతింగ్‌ రేట్‌ గండం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆటంకం సిద్దిపేట జిల్లాలో పరిస్థితి

అధికారుల నిర్లక్ష్యమే..

మున్సిపాలిటీల అభివృద్ధికి కీలకమైన కేంద్రప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు పన్నుల వసూళ్ల గ్రోతింగ్‌ రేట్‌ గండంగా పరిణమించింది. గతంతో పోలిస్తే.. పన్నుల వసూళ్ల శాతం 12.9శాతం పెరిగితేనే ఈ నిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన జిల్లాలోని గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలో ఈ అంశంలో వెనుకబడటం శాపంగా మారుతోంది.

– గజ్వేల్‌

జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. పన్నుల ద్వారా వచ్చే రాబడే ఈ మున్సిపాలిటీలకు ఆయువుపట్టు. ప్రత్యేకించి ఏటా కేంద్రం నుంచి విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులకు పన్నుల వసూళ్ల గ్రోతింగ్‌ రేట్‌ ఈసారి ఆటంకంగా మారింది. ఈ అంశంలో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలు ఈసారి వెనుక బడ్డాయి. ఫలితంగా ఈ మూడు మున్సిపాలిటీలకు ఈసారి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేలా లేవు. ఈ పరిణామం అభివృద్ధికి శాపంగా మారింది.

గ్రోతింగ్‌ రేట్‌లో వెనుకబాటు..

సాధారణంగా మున్సిపాలిటీలు ఏ యేటికాయేడు పన్నుల వసూళ్లల్లో 12.9శాతం గ్రోతింగ్‌ రేట్‌ సాధిస్తేనే ఆ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. కానీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ గ్రోతింగ్‌ రేట్‌ కనిపించడం లేదు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ గతంలో పెండింగ్‌లో ఉన్న రూ.1.22కోట్లతో కలుపుకొని ఈసారి రూ.5.78 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. కానీ కేవలం 4.07కోట్ల వసూళ్లు మాత్రమే జరిగాయి. 2024–25 ఏడాదిలో ఈ మున్సిపాలిటీలో 3.97కోట్ల పన్నుల వసూలు జరిగింది. ఈ లెక్కన 12.9 శాతం గ్రోతింగ్‌ రేట్‌ ప్రకారం 2025–26లో రూ.4.48కోట్ల పన్నుల వసూలు జరగాలి. కానీ 4.07కోట్ల వద్దే పన్నుల వసూలు ఆగిపోయింది. ఫలితంగా ఈసారి ఈ మున్సిపాలిటీకి రూ.3కోట్లకుపైగా వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కాగా నెలకు ఈ మున్సిపాలిటీలో వేతనాల పేరిట రూ.30లక్షలు, విద్యుత్‌ బిల్లుల పేరుమీద రూ.16లక్షలు, పారిశుద్ధ్యం, ఇతర అత్యవసర పనుల కోసం రూ.24లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన నెలసరి ఖర్చు సుమారు రూ.70లక్షల వరకు ఉంటుంది. దీని ప్రకారం ఈ మున్సిపాలిటీకి ఏటా సరాసరి గ్రాంట్లతో కలుపుకొని ఏడాదికి రూ.8కోట్లకుపైగా ఆదాయం ఉంటేనే.. అన్నీ వ్యవహారాలు సజావుగా సాగే అవకాశం ఉంది. కానీ నేడు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి రూ.3కోట్లకుపైగా 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం లేకపోవడం, పన్నుల వసూలు అంతంతమాత్రంగానే ఉండటం గుదిబండగా మారింది.

అభివృద్ధిలో వెనుకబడి

మున్సిపాలిటీకి ఉనికికి ప్రధాన ఆధారమైన పన్నుల వసూళ్లపై రెండేళ్లుగా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌లో నిర్లక్ష్యం నెలకొంది. ప్రధానంగా గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు తమకు కమీషన్లు వచ్చే పనులపై శ్రద్ధ పెట్టి పన్నుల వసూలును పట్టించుకోకపోవడం శాపంగా మారింది. ఫలితంగా ఈసారి 15వ ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకోలేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటిల్లోనూ ఇదేరకమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement