కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా సర్పంచులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీపీలు, సర్పంచులు సమన్వయంతో పనిచేస్తూ బాల్య వివాహాల నిరోధానికి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు.
విద్యార్థులపై గైర్హాజరుపై..
పాఠశాలల్లో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కాకపోతే, వారు ఎందుకు పాఠశాలకు రావడం లేదనే విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని డీఈఓ కు సూచించారు. బాల్య వివాహాలకు ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణంగా ఉన్నందున, కుటుంబాలకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించే దిశగా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాలలో బాల్య వివాహాల నిరోధక చట్టంతో పాటు పిల్లలకు కల్పించిన హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై రూపొందించిన వాయిస్ ఓవర్, వాల్ పోస్టర్లను ఆవిష్కరించి, అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీఆర్వో నాగరాజమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్, జిల్లా సంక్షేమ అధికారి శారద, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


