మద్దూరు(హుస్నాబాద్): స్థానిక కేజీబీవీలోని విద్యార్థినులకు రక్త పరీక్షలు నిర్వహించారు. రెండో రోజులుగా ఫుడ్ పాయిజన్‌తో 25 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో మంగళవారం మండల వైద్యాధికారి రజిత ఆధ్వర్యంలో పరీక్షలు చేపట్టారు. వైద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎవరూ ఆందోళ న చెందనవసరం లేదన్నారు. 250 మంది విద్యార్థులలో 120 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించామన్నారు. అదే విధంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అధికారులు సైతం శాంపిళ్లను సేకరించినట్లు తెలిపారు.
పీసీసీ రాష్ట్ర కార్యదర్శి పరామర్శ
చేర్యాల(సిద్దిపేట): ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మద్దూరు కేజీబీవీ విద్యార్థినులను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గిరి కొండల్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఆయన వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు.


