ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
ప్రభుత్వ తీరుకు నిరసనగా
గజ్వేల్‌లో ర్యాలీ, ధర్నా
గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ శ్రేణుల ర్యాలీ
గజ్వేల్: ప్రైవేటు వ్యక్తులచే కేసులు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తున్నదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్‌లో ర్యాలీ, ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్, ఇందిరాపార్కు చౌరస్తాల మీదుగా ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఐఓసీ గేటు ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అడబిడ్డల పెళ్లి కోసం అండగా నిలవాలనే సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిని నిర్వీర్యం చేసి పేదల ఆశలపై నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేక అసమర్థతను చాటుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తివేయడానికి కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. పేదల కోసం ఎంతటి పోరాటాలకై నా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం ఐఓసీలో ఆర్‌డీఓ వీవీఎల్ చంద్రకళకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చందన, వైస్ చైర్‌పర్సన్ పద్మబాయి, మాజీ ఎంపీపీ అమరావతి, మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, బీఆర్‌ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు.


