ఆపరేటర్ల సేవలకు స్వస్తి | - | Sakshi
Sakshi News home page

ఆపరేటర్ల సేవలకు స్వస్తి

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

వారి స్థానంలో జూనియర్‌

అసిస్టెంట్లకు బాధ్యతలు

ఈ నెల 7న జిల్లా కేంద్రంలో శిక్షణ

ఇప్పటికే మీసేవ ఆపరేటర్ల తొలగింపు

సంగారెడ్డి జోన్‌: భూ భారతి కంప్యూటర్‌ ఆపరేటర్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి స్థానంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లపై ప్రణాళికలు రూపకల్పన చేస్తుంది. భూ భారతి నిర్వహణలో అవకతవకలు, భూ రిజిస్ట్రేషన్ల అక్రమాలు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో వీరిని తొలగించాలని నిర్ణయించింది.

జూనియర్‌ అసిస్టెంట్లకు బాధ్యతలు

జిల్లావ్యాప్తంగా ఒక సబ్‌ కలెక్టర్‌, 3 రెవెన్యూ డివిజన్‌, 28 తహసీల్దార్‌ కార్యాలయాలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయాల్లో సాగులో ఉన్న భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆయా కార్యాలయాల్లో 25 మంది ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి అమలు సమయంలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో వీరిని నియమించగా, ఏళ్లుగా ఆపరేటర్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి సేవలకు స్వస్తి పలకనున్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 7న రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చి లాగిన్‌తో పాటు బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే మీసేవ ఆపరేటర్లను తొలగించి వారి స్థానంలో జీపీఓలకు బాధ్యతలు అప్పగించారు.

కార్యాలయాల్లో వారిదే హవా

తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రైవేట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో ఒకరోజు వ్యవధిలో సుమారు 20 వరకు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భూ రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్‌ పత్రాల పేరుతో ఇష్టారాజ్యాంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆపరేటర్లకు డబ్బులు ఇవ్వకుంటే సర్వర్‌ బిజీ, నెట్‌ రావడం లేదని ఇతర సాకులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సంబంధిత కార్యాలయ అధికారులు చెప్పినప్పటికీ వినకుండా పెడచెవిన పెట్టేవారు. ఆపరేటర్లు కింగ్‌లుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయాన్ని బట్టి రోజుకి రూ.1 వెయ్యి నుంచి రూ. 30 వేల వరకు దండుకుంటున్నారు.

పారదర్శకత కోసమే..

తహసీల్దార్‌ కార్యాలయాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టి పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రైవేట్‌ వ్యక్తుల సేవలను తొలగించనున్నారు. భూ రిజిస్ట్రేషన్‌లతో పాటు ఇతర కార్యకలాపాలు అక్రమ వసూళ్లు, అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయిం తీసుకున్నారు. కార్యాలయాల్లోని ఆపరేటర్లపై గత కొంతకాలంగా ప్రత్యేక అధికారులు విచారణ చేసి తొలగిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్‌ వ్యక్తుల జోక్యం లేకుండా పూర్తిగా ప్రభుత్వ అధికారులే త్వరలో సేవలు అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement