కలెక్టర్ హైమావతి
● అధికారులతో కలెక్టర్ సమీక్ష ● అర్జీలు పరిష్కరించకుంటే జరిమానా
సిద్దిపేటరూరల్/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో ఎంపీల్యాడ్స్ పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంతాభివృద్ధి పథకం పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ హైమావతి సోమవారం సమీక్షించారు. అనంతరం సీజనల్ వ్యాధులపై మండల ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ...16వ, 17వ లోక్‌సభ, రాజ్యసభకు సంబంధించి, 18వ లోక్‌సభ కింద మంజూరైన ఎంపీల్యాడ్స్ పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిని పర్యవేక్షించాలని జెడ్పీసీఈఓకు ఆదేశించారు. జిల్లాలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పంచాయతీ శాఖ సహకారంతో మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి నీటి నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని, చెత్తాచెదారం తొలగించాలని, డెంగీ వ్యాధి నమోదైన గ్రామాల్లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు.
30 రోజుల్లో పరిష్కరించకపోతే జరిమానా
ప్రజావాణిలో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న అర్జీలను 30 రోజుల్లో పరిష్కరించాలని లేని పక్షంలో శాఖల వారీగా రూ.1000 చొప్పున జరిమానా విధిస్తానని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనపై బ్రహ్మ కుమారీలు రూపొందించిన ‘నషా ముక్తి భారత్ అభియాన్’పోస్టర్‌ను ఆవిష్కరించి, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు.
విదేశీ నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ట్రిపుల్ విన్ ప్రాజెక్టు ద్వారా జర్మనీ, ఆస్ట్రియాలో నర్సింగ్ ఉద్యోగాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. గుర్తింపు పొందిన కళాశాల నుండి జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, పూర్తి చేసి తెలంగాణ వాసి అయి, వయస్సు 22 నుంచి 38 మధ్యలో, కనీసం 1–3 ఏళ్ల అనుభవం, ఇండియన్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్య త ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9440049645, 9440052081, 9440051581 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
ఎనిమిదేళ్లుగా రెవెన్యూ శాఖలో భూసంబంధిత సేవల నిర్వహణలో కీలకపాత్ర వహిస్తున్న ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతీరోజు కోడిగుడ్డు ఇవ్వాలి
ప్రతీరోజు విద్యార్థులకు కోడిగుడ్డును వడ్డించాలని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. పప్పు పలుచగా ఉందని సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట గది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.


