● రుద్రునికి జలాభిషేకం ● భక్తిపారవశ్యంలో వర్గల్ క్షేత్రం
వర్గల్(గజ్వేల్): రుద్రునికి భక్తజన సామూహిక జలాభిషేకం నేత్రపర్వంగా సాగింది. కరువు తీరా వర్షాలు కురవాలి. దేశం సుభిక్షం కావాలనే సంకల్పంతో చేపట్టిన వరుణయాగం సంపూర్ణమైంది. భక్తిప్రపత్తులతో కొనసాగిన ఈ మహత్కార్యంతో వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో పది రోజులపాటు నిర్వహించిన వరుణయాగం సోమవారం మహా పూర్ణాహుతితో ముగిసింది. ముగింపు రోజున శ్రీచంద్రమౌళీశ్వరునికి అర్చక, వేదపండితులు, భక్తజనులతో కలిసి సామూహిక జలాభిషేకం చేశారు. రుద్రుడిని స్మరిస్తూ జలబంధం చేశారు. ఈ సందర్భంగా సిద్ధాంతి మాట్లాడుతూ..లోక కల్యాణం కోసం యజ్ఞయాగాదుల నిర్వహణ అనాదిగా వస్తోందన్నారు. వేద పండితులు నిర్వహించే విశేష వైదిక క్రతువు వరుణయాగంతో ప్రకృతి కరుణిస్తుందని, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని పేర్కొన్నారు. కాగా యాగ, అభిషేకాది కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తరించారు.


