చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సభ ఈ నెల 6న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి పోతకాజు శంకర్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గద్దర్ వర్ధంతి సభకు కవులు, గాయకులు, కళాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
తల్లిపాలతో సంపూర్ణ ఆరోగ్యం
ఐసీడీఎస్ సెక్టార్ సూపర్‌వైజర్ దివ్య
సిద్దిపేటరూరల్: పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నారాయణరావుపేట ఐసీడీఎస్ సెక్టార్ సూపర్‌వైజర్ దివ్య పేర్కొన్నారు. నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొందిలో సోమవారం నిర్వహించిన తల్లి పాల వారోత్సవాలకు దివ్య హాజరై మాట్లాడారు. తల్లి పాల ప్రాముఖ్యతపై ప్రతీ ఏటా వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ముక్యాన్సర్ దూరమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న, టీచర్లు రేణుక, చిలుక, అంజమ్మ, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్
అమలు చేయాలి
డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి శంకర్
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన చేవెళ్ల డిక్లరేషన్ హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర డీహెచ్‌పీఎస్ శాఖ పిలుపు మేరకు దళితుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌లో ఏఓకు సోమవారం వినతిపత్రాన్ని సమర్పించా రు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ... దళితుల అభివృద్ధికి కేటాయించిన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఇతర అవసరాలకు మళ్లించడం రాజ్యంగ విరుద్ధమన్నారు. దళితుల విద్య, ఉపాధి, గృహనిర్మాణం, ఆరోగ్యం, మౌలిక వసతుల కోసమే ఖర్చు చేయాలన్నా రు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, మంజుల, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఎస్టీ మోర్చా
జిల్లా కమిటీ నియామకం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా కమిటీని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ సోమవారం ప్రకటించారు. బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నునావత్ మోహన్ నాయక్, ఉపాధ్యక్షులుగా వనం యాదయ్య, అజ్మీర ధనరాజ్, బానోత్ అనిల్ నాయక్, ప్రధాన కార్యదర్శులుగా బానోత్ సంతోశ్ నాయక్, గుగులోతు లకతి నాయక్, కార్యదర్శులుగా చెదిరి రాజు, బుక్క రవి, మాలోతు రమేశ్, మీడియా కన్వీనర్‌గా ముదావత్ సంతోశ్ నాయక్, కోశాధికారిగా మాలోతు తిరుపతి నాయక్, కార్యవర్గ సభ్యులుగా మాలోతు సురేశ్ నాయక్, ఉండాడి శ్రీను, బానోతు సుమన్ నియామకమైనట్లు అధ్యక్షుడు ప్రకటించారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
బీజేవైఎం నాయకులు
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. ప్రతిభ జూనియర్, న్యూజనరేషన్ కాలేజీల్లో ‘ఫీజుల బకాయి, బీజేపీ లడాయి’కార్యక్రమంలో భాగంగా సోమవారం సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా 40లక్షల మంది పేద విద్యార్థులు పథకం మీద ఆధారపడి చదువుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.15వేల కోట్ల బకాయిలున్నాయన్నారు. ప్రైవేటు కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకట్, నాయకులు శ్రీనివాస్, ప్రశాంత్, పద్మ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


