టెండర్ లేదు.. పాలక వర్గ తీర్మానం లేదు
బోర్డుల ఏర్పాటు తెలియదంటున్న బల్దియా అధికారులు
ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు నిర్మించిన జాతీయ రహదారిపై హుస్నాబాద్ పట్టణం హన్మకొండ రోడ్‌లోని కేడం లింగమూర్తి పెట్రోల్ బంక్ నుంచి సిద్దిపేట రోడ్‌లోని హనుమాన్ పెట్రోల్ బంక్ వరకు రోడ్డు మధ్యన డివైడర్ ఏర్పాటు చేశారు. ఈ డివైడర్‌ల మధ్య అనుమతి లేకుండానే వ్యాపార ప్రకటనల కోసం గ్లోసన్ బోర్డులను పెట్టారు. వాస్తవానికి ఈ గ్లోసన్ బోర్డులు పెట్టుకోవాలంటే మున్సిపల్ అనుమతి తప్పనిసరి కాగా అదేమీ లేకుండానే ఈ బోర్డులు ఏర్పాటు చేసి మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారు.
హుస్నాబాద్: గ్లోసన్ బోర్డులు పెట్టుకునేందుకు పదిలోపు బోర్డులైతే చదరపు అడుగుల చొప్పున మున్సిపల్ పాలకవర్గం ధరను నిర్ణయించి అనుమతిని ఇస్తారు. ఆపై ఎక్కువ బోర్డులు పెట్టుకుంటే తప్పనిసరిగా టెండర్ పిలవాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకి ఏడాది కాలంపాటు నిర్వహణ బాధ్యత ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం టెండర్ లేకుండా అనుమతి తీసుకోకుండానే వందకు పైగా గ్లోసన్ బోర్డులు ఏర్పాటు చేసేశారు. ఈ విషయం మున్సిపల్ అధికారులకే తెలియదని చెబుతున్నారు. హన్మకొండ రోడ్‌లోని కేడం లింగమూర్తి పెట్రోల్ బంక్ నుంచి సిద్దిపేట రోడ్‌లోని హనుమాన్ పెట్రోల్ బంక్ వరకు రోడ్డు డివైడర్ల మధ్య విద్యుత్ స్తంభాలు వేసి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ డివైడర్ల మధ్యలో వందకు పైగా గ్లోసన్ బోర్డులను ఏర్పాటు చేశారు.
మున్సిపల్‌లో లెక్క లేదు.. పత్రం లేదు
మున్సిపల్ పరిధిలో గ్లోసన్ బోర్డుల ఏర్పాటు ప్రక్రియ టౌన్ ప్లానింగ్ పరిధిలోకి వస్తోంది. గ్లోసన్ బోర్డుల నిర్వహణ బాధ్యతకు సంబంధించి టెండర్ ప్రక్రియ, ఏజెన్సీ పేరు, ఏ వ్యక్తికి అప్పగించారో రికార్డులు లేవు. ఎవరిని అడిగినా మాకేమీ తెలియ దని సమాధానం చెబుతున్నారు. కనీసం పాలకవర్గంలో తీర్మానం చేశారా అంటే అదీ లేదు. బహి రంగంగా నడిబొడ్డున మున్సిపల్ అనుమతి లేకుండా డివైడర్లపై గ్లోసన్ బోర్డులు ఏర్పాటు చేసినా అధికారులు గుర్తించకపోవడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా, పలు మున్సిపాలిటీల్లో ఇష్టానుసారంగా ఎవరికి వారే రేట్లను ఫిక్స్ చేసుకుని వసూలు చేస్తున్నారని మున్సిపల్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్లల్లో ఎంత రేటు వసూలు చేయాలో నిర్ణయించిన తర్వాతనే గ్లోసన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మోమో జారీ చేసినట్లు సమాచారం.
ఏర్పాటు చేసిందెవరు?
బోర్డులు ఏర్పాటు చేసిన వారెవరో తెలియదు. కానీ ఎవరైనా యాడ్స్ వేసుకునే వారు ఫలాన నంబర్‌కు ఫోన్ చేయాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. డివైడర్ మధ్యన ఉన్న గ్లోసన్ బోర్డు ఒక్కటికి నెలకు రూ.3వేలు, విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన బోర్డు కావాలంటే రూ.4 వేలు అని ప్రచారం జరుగుతోంది. ఒక్కో బోర్డుకు రూ.3 వేల చొప్పున లెక్క వేసుకున్న నెలకు రూ.3 లక్షలవుతుంది.
అనుమతి లేకుండానే
డివైడర్లపై బోర్డుల ఏర్పాటు


