పొదుపు రుణం పక్కదారి | - | Sakshi
Sakshi News home page

పొదుపు రుణం పక్కదారి

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

ఒక సభ్యురాలికి రెండు బ్యాంకుల్లో రుణం

ఒక సభ్యురాలికి రెండు బ్యాంకుల్లో రుణం

రూ.2 కోట్ల రుణాలు దారిమళ్లింపు

పల్లెలో నిలిచిన శ్రీనిధి రుణాలు

క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌

చర్యలు తీసుకోలే

మా ఊరిలో రెండు గ్రామైక్య సంఘాలు ఉంటే రూ.50 లక్షల వరకు బకాయిలు ఉండటంతో కొత్త వారికి రుణాలు ఇవ్వడంలేదు. బోగస్‌ సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఒకరే రుణాలను వాడుకోవడం వల్ల రూ.2 కోట్ల రుణాలు పక్కదారి పట్టాయి. వీటిపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి దారి మళ్లిన రుణాలను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలి.

–బొమ్మగాని రాజ్‌కుమార్‌,

ఉపసర్పంచ్‌, పోతారం

మా దృష్టికి ఫిర్యాదు రాలేదు

క సంఘం మూడు నెలలు వాయిదాలు క్రమంగా చెల్లించకపోతేనే ఆ సంఘం గురించి బ్యాంకు అధికారులు మా దృష్టికి తీసుకొస్తారు. రుణాలు పక్కదారి పట్టిన విషయంలో మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

–సుధీర్‌, ఏపీడీ, సిద్దిపేట

మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాలు జిల్లాలో కొన్ని చోట్ల పక్కదారిపడుతున్నాయి. మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను కొంతమంది దుర్వినియోగం చేయడంతోపాటుగా వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోవడంతో అవి మొండి బకాయిలుగా మారిపోతున్నాయి. దీంతో కొంతమంది మహిళలకు కొత్త రుణాలు అందడం లేదు.

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ మండలంలో 590 సంఘాల్లో 5,740 మంది సభ్యులు బ్యాంకు లింకేజీతో పాటు శ్రీనిధి రుణాలను తీసుకున్నారు. చాలామంది రుణాలు చెల్లించిన కొన్ని గ్రామాల్లో శ్రీనిధిలో మొండి బకాయిలు దాదాపు రూ.95 లక్షల చేరగా జిల్లెలగడ్డ, పోతారం(ఎస్‌) గ్రామాల్లో రూ.60 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో కొత్తవారికి శ్రీనిధి రుణాలు నిలిపి వేసినట్లు సంఘ సభ్యులు వాపోతున్నారు. వ్యవసాయ పెట్టుబడులకు, పాడి పశువుల కొనుగోలుకు అవసరపడతాయని భావించిన మహిళలకు నిరాశే ఎదురవుతోంది. మొండి బకాయిలను వసూలు చేసిన తర్వాతే కొత్త రుణాలు ఇవ్వాలని అధికారులు హుకుం జారీ చేయడంతో సభ్యులకు కొత్త రుణాలు అందడం లేదు.

ఒకరికి రెండు బ్యాంకుల్లో రుణం

జిల్లాలో 19,897 సంఘాలు ఉండగా అందులో 1,96,623 మంది సభ్యులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు. బ్యాంకుల రుణాలకు తోడు స్వయం ఉపాధి, పాడి పరిశ్రమ ఏర్పాటుకు శ్రీనిధి బ్యాంకు ద్వారా కూడా రుణాలు పొందుతున్నారు. బ్యాంకు లింకేజీల ద్వారా ఉపాధి పొందాలని అధికారులు ఎలాంటి తాకట్టు లేకుండా ఒక్కొక్క సంఘానికి రూ.20లక్షల వరకు బ్యాంకు లింకేజీలు ఇప్పిస్తున్నారు. కొందరు అధికారుల మంచితనం ఆసరా చేసుకుని ఒక బ్యాంకులో లింకేజీ తీసుకున్న గ్రూపు సభ్యులు రుణం చెల్లించకపోవడంతో ఆ గ్రూపులను అధికారులు బ్లాక్‌ లిస్టులో పెట్టారు. గ్రామాల్లోని సీఏల సహకారంతో అదే సభ్యులతో లీడర్లను మార్చి కొత్తగ్రూపు ఏర్పాటు చేసి మరో బ్యాంకులో లింకేజీ ఇప్పించారు. ఇందులో కెనరా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో బోగస్‌ మహిళా గ్రూపు సభ్యులు రుణాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు రూ.2 కోట్ల బ్యాంకు లింకేజీ బోగస్‌ గ్రూపుల పేరుతో తీసుకుని మరొక్కరు రుణాలను సొంతానికి వాడుకున్నట్లు మహిళా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. హుస్నాబాద్‌ ఏపీఎం దగ్గరకు పోతారం(ఎస్‌) మహిళలు వచ్చి మాకు ఒక బ్యాంకు రుణమే తెలుసు రెండో బ్యాంకు రుణం మాకు తెలియదని ఫిర్యాదు చేయడంతో ఏపీఎం గ్రామ సంఘం సమావేశం ఏర్పాటు చేసి రుణం పొందిన వారి వివరాలను వెల్లడించారు. గ్రామైక్య సంఘం అధ్యక్షులను, సీఏలను అధికారులు వారికి అనుకూలమైన వారిని ఎంపిక చేసుకుని నడిపించడం వల్ల ఇలాంటి అక్రమాలు బయటకు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement