● చిటుకు వ్యాధితో మొదటికే మోసం ● అప్రమత్తతతోనే రక్షణ సాధ్యం ● పశు సంవర్థకశాఖ డాక్టర్ నిహారిక
దుబ్బాకటౌన్: వర్షాకాలంలో తొలకరి చినుకులు మూగజీవాల పాలిటి శాపాలు. వాటి వల్ల జీవాల పెంపకందారులు తరచూ నష్టాలకు గురవుతారు. తొలకరి చినుకులకు మొలిసిన గడ్డిని గొర్రెలు, మేకలు తినడం వల్ల చిటుకు వ్యాధి సోకుతుంది. దీనిని పలురకాల పేర్లతో పిలుస్తుంటారు. నెత్తిపిడుగు, గడ్డిరోగం, పాటురోగం అనే పేర్లు కూడా ఉన్నాయి.
బలిష్టంగా ఉన్న గొర్రెలకే..
ఈ వ్యాధి నివారణకు గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలని తిమ్మాపూర్ పశు సంవర్థకశాఖ వైద్యురాలు డాక్టర్ నిహారిక సూచించారు. బలిష్టంగా పెరిగిన గొర్రెలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఆమె తెలిపిన కొన్ని సూచనలు, సలహాలు.
అకస్మాత్తుగా మరణిస్తాయి
ఈ వ్యాధి సోకిన గొర్రెలు సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అకస్మాత్తుగా మరణిస్తాయి. చనిపోయే ముందు చాలా నీరసంగా ఉంటాయి. ఎగిరి కిందపడి కాళ్లు కింద కొట్టుకుంటూ, పళ్లు కొరకుతూ.. బిగుసుకుని కొన్ని క్షణాల్లో చనిపోతాయి. ఈ వ్యాధి సోకిన మరికొన్ని గొర్రెలు చొంగ కారుస్తుంటాయి. శ్వాస అధికంగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించి మందకు చికిత్స చేయించాలి.
నివారణే ముఖ్యం
చికిత్స కంటే వ్యాధి నివారణే ముఖ్యం. ఏటా ఏప్రిల్, మే నెల మధ్యలో మందలో ఉన్న జీవాలన్నింటికీ వ్యాధి నిరోధక టీకా(మల్టీ కాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) తప్పకుండా వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో పశువైద్యాధికారికి తెలియజేసి చికిత్స, జాగ్రత్తలు పాటించాలి. తొలకరి వర్షాలకు మొలిసి వాడిపోయిన గడ్డిని మేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం సమయంలో జీవాలను మేపకూడదు. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరుచేయాలి. జాగ్రత్తలు పాటిస్తే చిటుకు వ్యాధి బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చు. నిహారిక,
పశు సంవర్థకశాఖ డాక్టర్, తిమ్మాపూర్
ఇలా సోకుతుంది
మేత కోసం వలస వెళ్లే గొర్రెల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రీడియం ఫర్ ఫ్రింజర్స్ టైప్–డీ రకం సూక్ష్మజీవులు జీవాల ప్రేవుల్లో అభివృద్ధి చెందుతాయి. అవి వదిలిన విషపదార్థాలు చిటుకు వ్యాధికి కారణమవుతాయి. తొలకరి చినుకులకు పెరిగిన లేతగడ్డిని గొర్రెలు ఇష్టంగా తింటాయి. దీనివల్ల వాటి ప్రేవుల్లో గాలిలేని వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి తొలకరి చినుకులు పడినప్పటి నుంచి జూలై నెలాఖరు మధ్య ఎక్కువగా సంభవిస్తుంది.


