ఏబీవీపీ నాయకుల డిమాండ్
సిద్దిపేటఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయడంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) మంగళవారం కళాశాలల బంద్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సావుల ఆదిత్య, జిల్లెల ఫణీందర్ తదితరులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల గురించి వివరించి బయటకు పంపించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుతున్నారన్నారు. ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు తరుణ్, లోకేశ్, శ్రావణ్, శ్రీకాంత్, అశ్వల్, పవన్, సాత్విక్, చరణ్, ఆదిత్య, శ్రీషన్ తదితరులు పాల్గొన్నారు.
ఎత్తి వేసేందుకు కుట్ర
బెజ్జంకి(సిద్దిపేట): విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర సాయిరాం ఆరోపించారు. బెజ్జంకిలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు రూ.11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. బకాయిల కారణంగా కళాశాలల నుంచి సర్టిఫికెట్‌లు తెచ్చుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత్, రవి, వీరేశం, సాయిలు పాల్గొన్నారు.
విద్యార్థుల హక్కు
హుస్నాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వ భిక్ష కాదని ఏబీవీపీ నాయకులు అన్నారు. పట్టణంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమ కార్యాచరణను చేపడతామన్నారు. నగర కార్యదర్శి బత్తుల రాజు, నాయకులు రాజేశ్, చరణ్, అంజి, రంజిత్ తదితరులు ఉన్నారు.
బంద్ విజయవంతం
నంగునూరు(సిద్దిపేట): విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నంగునూరులో జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ బంద్ నిర్వహించారు.


