మున్సిపల్ కమిషనర్ మహేశ్‌కుమార్
దుబ్బాకటౌన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్తసేకరణ వాహనాలకు అందించాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఎ.మహేశ్‌కుమార్ సూచించారు. 16వ వార్డులోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన డ్రైడే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దేవుని రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సిబ్బందితో చెత్త, వ్యర్థాలను తొలగింపజేశారు. దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. వర్షపు నీరు వృథాగా పోకుండా చేపట్టే సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
దోమల వ్యాప్తిని అరికట్టాలి
చేర్యాల(సిద్దిపేట): వర్షాకాలం దృష్ట్యా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ మేడిశెట్టి ఉమ పిలుపునిచ్చారు. డ్రై డే కార్యక్రమంలలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిలిచిన నీటిని తొలగించడం, పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి శుభ్రం చేయడం, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూలకుండీలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా, వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


