మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ
చేర్యాల(సిద్దిపేట): నీటిని వృథా చేయకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మున్సిపల్ చైర్‌పర్సన్ ముస్త్యాల అరుణ అన్నారు. జాతీయ జల మిషన్‌లో భాగంగా మంగళవారం పట్టణ పరిధిలోని 6వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలతో కలిసి జల సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాట్లాడుతూ వర్షపు నీటిని సేకరించడం, ప్రతి నీటి చుక్కను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు తాగునీటి కొరత రాకుండా చూడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల శక్తి అభియాన్ – క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
భూ గర్భ జలాలను అభివృద్ధి చేసుకోవాలి
హుస్నాబాద్‌రూరల్: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీఓ సతీశ్ అన్నారు. బంజేరుపల్లి, పోతారం(ఎస్) గ్రామాల్లో ఆయన పర్యటించి బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని సూచించారు. బంజేరుపల్లి బోరుబావి వద్ద ఇంకుడు గుంత పనులను ప్రారంభించారు. రైతులకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించి ఉపాధి హామీ పథకంలో పనులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ మనీల, సర్పంచ్‌లు చంద్రకళ, లత తదితరులు ఉన్నారు.


