● ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు ● కేసీఆర్‌నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద ధర్నా
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని కేసీఆర్‌నగర్ డబుల్‌బెడ్రూం కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్‌నగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, కోట్ల రూపాయలతో భవనాలు నిర్మిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు. కలెక్టర్ హైమావతి తక్షణమే స్పందించి కేసీఆర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిశీలించాలని, శాశ్వత పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


