లబ్ధిదారుల్లో అయోమయం జిల్లాకు మంజూరైన ఇళ్లు: 11,834 ఇప్పటి వరకు నిర్మించినవి: 2,567 ఫైనల్ బిల్లు అందినవి: 491 ఇంకా 2,076 గృహాలకు రూ. 33.21 కోట్లు పెండింగ్
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బోండ్ల శోభ. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి మూడు నెలలు అవుతోంది. ఇల్లుతో సొంతింటి కల నెరవేరింది కానీ.. అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే బిల్లులు సరిపోవడం లేదని, దీంతో అప్పులు తెచ్చి
ఇంటి నిర్మాణం చేయాల్సి వస్తోందని వాపోయారు. ఫైనల్ బిల్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. అప్పులు
తెచ్చిన వాటికి వడ్డీ పెరిగిపోతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఫైనల్ బిల్లు త్వరగా ఇప్పించాలని శోభ కోరుతున్నారు.
గృహ ప్రవేశమైనా పైసలు అందలే..
ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి అయి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ.4లక్షలు మాత్రమే వచ్చాయి. ఇటీవల గృహ ప్రవేశం సైతం పూర్తయింది. అయినప్పటికీ ఫైనల్ బిల్లు రాలే. ప్రభుత్వం అందించిన డబ్బులే సరిపోవడంలేదు.. మరో వైపు బిల్లు ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్నాం.
–గీకురు సుమలత,
హుస్నాబాద్
సాక్షి, సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చివరి బిల్లు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పలువురు పేదలకు ఆర్థికంగా భారమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం లబ్ధిదారులను అప్పుల ఊబిలోకి నెడుతోంది. జిల్లా వ్యాప్తంగా 11,834 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 10,244 ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోశారు. ఇందులో 2,567 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయి. వాటిలో 491 వాటికే పూర్తి బిల్లులు చెల్లించారు.
జిల్లా వ్యాప్తంగా 10,244 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాగా అందులో బేస్‌మెంట్ స్థాయిలో 1,489, గోడల నిర్మాణం 821, స్లాబ్ వేసినవి 3,998, నిర్మాణం పూర్తి అయినవి 2,567 ఉన్నాయి. వీటిలో చివరి బిల్లు కేవలం 491 ఇళ్లకు మాత్రమే చెల్లించగా మిగతా 2,076 ఇళ్లకు ఇంకా రూ.33.21కోట్లను లబ్ధిదారులకు చెల్లించాలి. గృహ ప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా.. చివరి బిల్లుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మరికొందరి ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవడంతో అప్పులు చేసి పనులు చేపడుతుండటం గమనార్హం. దీనికి తోడు ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసిన బిల్లులు సైతం ఆలస్యమవుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం మొత్తంగా దాదాపు రూ.12లక్షలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం అందించే సాయంలో నిర్మాణం చేసే మేసీ్త్రకే రూ.3.5లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే డబ్బుల్లో మిగిలేది రూ.1.5లక్షలు మాత్రమే. మెటీరియల్, ఇతర ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ వారికి ఇలా దాదాపు మొత్తంగా అదనంగా రూ.7లక్షలు లబ్ధిదారుల మీద డబ్బులు పడుతున్నాయి.
వడ్డీల భారం
ఓ వైపు బిల్లులు రాకపోవడం.. ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోకపోవడంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి బిల్డర్లు డబ్బులు అడుగుతుండటంతో గత్యంతరం లేక లబ్ధిదారుల తమ వద్ద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు. మరికొందరు గ్రామాల్లో రూ.2 వడ్డీకి అప్పులు తెస్తూ.. ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలను పూర్తి చేసిన వారికి బిల్లు చెల్లింపుల్లో జాప్యం కారణంగానే అనేక చోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు చెల్లించే విధంగా కృషి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఫైనల్ బిల్లు ఆలస్యమవుతోంది
ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఫైనల్ బిల్లు ఆలస్యమయ్యేది వాస్తవమే. త్వరలో ఫైనల్ బిల్లు ప్రభుత్వం చెల్లించనుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చే యించిన వారికి మిగతా బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది.
– భగవాన్ రావు, ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ


