కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు హుండీల ద్వారా రూ.94లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 47రోజులలో భక్తుల కానుకల రూపంలో రూ.94,93,627 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో కానుకలను లెక్కించారు. నగదు రూ.94,93,627, మిశ్రమ బంగారం 56 గ్రాముల 600మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 500గ్రాములు, విదేశీ కరెన్సీనోట్లు 32 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
పరిహారం ఇవ్వకుండానే రోడ్డు పనులా?
అడ్డుకున్న గ్రామస్తులు
కోహెడరూరల్(హుస్నాబాద్): మండల పరిధి నాగసముద్రాల గ్రామ శివారులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ రహదారి (765 డీజీ) మెదక్–ఎల్కతుర్తి విస్తరణ రోడ్డు పనులను సోమవారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా ప్రారంభించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండానే ఎలా ప్రారంభిస్తారని వారు ప్రశ్నించారు. మా భూములు వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ బాధితుల గోడును పట్టించుకోని అధికారులు తీరుపై మండిపడ్డారు. పరిహారం అందే వరకు ఇంచు భూమి కూడా వదలమని బాధితులు తెగేసి చెప్పారు.
‘చేనేత’ సలహా మండలి చైర్మన్‌గా శ్రీనివాస్
హుస్నాబాద్: చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సలహా మండలి కమిటీ చైర్మన్‌గా చింతకింది శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పద్మ శాలి సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సోమవారం స్థానిక శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో అభినంద సభ ఏర్పాటు చేశారు. చేనేత వృత్తిదారుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతకారుల సమస్యల పరిష్కారంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చేనేత, పద్మశాలి సంఘ నాయకులు భగవాన్, వెంకటరమణ, లక్ష్మీపతి, లక్ష్మయ్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
గొర్రెలు, మేకలలో
పీపీఆర్ వ్యాధి
నేటి నుంచి 28 వరకు టీకాలు
జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి గోపాలకృష్ణమూర్తి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గొర్రెలు, మేకలలో పీపీఆర్ వ్యాధి (పారుడు రోగం) వ్యాపిస్తోందని, పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. పీపీఆర్ వ్యాధి వైరస్ వలన వ్యాపిస్తోందన్నారు. గొర్రెలు, మేకలలో తీవ్ర జ్వరం, నోటిలో పొక్కులు రావడం, పల్చటి విరేచనాలు, శ్వాస సరిగా తీసుకోకపోవడం, ముక్కు, కళ్ల నుంచి స్రవాలు కారడం, డీ హైడ్రేషన్‌కు గురి అవ్వడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి వలన 4 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు మరణిస్తాయన్నారు. ఈ వ్యాధి నివారణకు గాను పీపీఆర్ టీకాలు వేయాలన్నారు. వ్యాధిని గమనించిన వెంటనే పశు వైద్యున్ని సంప్రదించి, చికిత్స అందించాలన్నారు. ఈ వ్యాధి నివారణకు మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు.


