గజ్వేల్: రాయపోల్ మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోగల టెంకంపేట కొండపోచమ్మసాగర్ కాల్వ భూనిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సందెబోయిన ఎల్లయ్య కోరారు. అదేవిధంగా ఆహ్మద్‌నగర్ నుంచి ముత్యంపేట వరకు కాల్వ నిర్మాణం చేపట్టాలన్నారు. సోమవారం గజ్వేల్‌లోని ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ సమస్యపై రైతులతో కలిసి అధికారులకు ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెంకంపేటకు చెందిన 19మంది రైతులకు చెందిన 15ఎకరాల భూమిలో కొండపోచమ్మసాగర్ కాల్వను మూడేళ్ల క్రితం నిర్మించారని, అయినా ఇప్పటివరకు రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆహ్మద్‌నగర్– ముత్యంపేట వరకు కాల్వను నిర్మించాలని రైతులు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగారెడ్డి పాల్గొన్నారు.


