నంగునూరు(సిద్దిపేట): గోదావరి నదిలో కావాల్సినన్ని నీళ్లున్నా కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతో కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రభుత్వం ఆన్ చేయించడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తిమ్మాయిపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో శనివారం హరీశ్‌రావు పాల్గొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎంతటి కరువు వచ్చినా రైతాంగానికి సాగునీరు ఇచ్చేలా కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారన్నారు. మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక సాగర్ నిండి సిద్దిపేట నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించానని చెప్పారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీ ద్వారా అధిక లాభాలు వస్తున్నందున రైతులు ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతం పడితే ఆయిల్‌పామ్ రైతులకు 20 రోజులకో మారు ఏడాదిలో 15 సార్లు డబ్బులు పడుతున్నాయని చెప్పారు.
ప్రతీ ఓటరును కలవండి
సిద్దిపేటజోన్: సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవల్ ఏజంట్లు అత్యంత కీలకమని, ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతీ ఓటరును క్షేత్ర స్థాయిలో కలవాలని, ఎన్యూమరేషన్ పత్రాలు నింపేలా బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరును బూత్ లెవల్ ఏజెంట్లు కలిసి ఓటుహక్కు విలువ గూర్చి వివరించి చైతన్యం చేయాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనేది రాజ్యాంగ సూత్రమని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసు
మాజీ మంత్రి హరీశ్‌రావు


