మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో నిర్వహిస్తున్న సర్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. డిజిటలైజేషన్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకూడదనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పని చేస్తుందన్నారు. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం నేరమన్నారు. మరణించిన ఓటర్లు, నకిలీ ఓట్లు, రెండు ఓట్లు కలిగి ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో సర్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ఎమ్యునరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. బీఎల్‌ఓ వారిగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సైతం వేగంగా కొనసాగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభు త్వ భూమిని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఆయా మండలాల తహసీ ల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి
క్షేత్రస్థాయిలో పరిశీలన


