కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కష్టాలే.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కష్టాలే..

Jul 10 2026 9:51 AM | Updated on Jul 10 2026 9:51 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిన్న చూపని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు అన్నీ కష్టాలే వస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్లాపూర్‌లో ఫర్టిలైజర్‌ షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటు ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యాప్‌ను రద్దు చేసి నేరుగా యూరియా కొనుగోలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు అందించే యూరియాపై సీలింగ్‌ ఎత్తివేయాలన్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రాధాకృష్ణ శర్మ, కాముని శ్రీనివాస్‌, పాపయ్య, వెంకట్‌రెడ్డి, కనకరాజు, దుర్గారెడ్డి తదితరులు ఉన్నారు.

జిల్లా రైతులకే ప్రాధాన్యత..

జిల్లా రైతులకు సరిపడా ఆయిల్‌ పామ్‌ మొక్కలు అందాక ఇతర జిల్లాల రైతులకు మొక్కలు అందజేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు జిల్లా ఆయిల్‌ఫెడ్‌ అధికారి బాస్కర్‌ రెడ్డికి సూచించారు. రంగనాయక సాగర్‌ కట్ట వద్ద ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించారు. ఇతర జిల్లాలకు మొక్కలు తరలించడంతో ఆయిల్‌ ఫెడ్‌ అధికారి భాస్కర్‌రెడ్డితో ఫాన్‌లో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు సరిపడా మొక్కలు అందించారా? అందించకముందే ఇతర జిల్లాలకు పంపడం ఏమటని ప్రశ్నించారు. ముందు జిల్లాలో రైతులకు మొక్కలు అందించాలన్నారు. నర్సరీ నిర్వహణ సరిగా లేదని, మొక్కల్లో ఇసుక ఉందని, నీళ్లు కూడా సరిగా పట్టడం లేదని చెప్పారు. నర్సరీని వారానికి ఒకసారి సందర్శించి నిర్వహణ చూడాలని ఆదేశించారు.

సర్‌లో భాగస్వామ్యం కావాలి

సిద్దిపేటజోన్‌: సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్‌)ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తప్పనిసరి ఓటరు ఎన్యుమరేషన్‌ పత్రాలను నింపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ నుంచి ఎన్యుమరేషన్‌ పత్రం తీసుకుని దాన్ని పూరించి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్‌ పత్రం నింపాలని సూచించారు. ఇప్పుడు నింపితేనే మీ ఓటుహక్కు జాబితాలో భద్రంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ తమ ఇండ్లకు వచ్చే బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు సహకరించాలని సూచించారు.

ఇందిరానగర్‌ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం

సీలింగ్‌ ఎత్తివేసి సరిపడాయూరియా అందజేయాలి

మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోనే ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు ఐప్యాడ్‌లను గురువారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ పలితాలు సాధించిన 31 మందికి ఐప్యాడ్‌లు అందించానని, 2026–27 విద్యాసంవత్సరంలో 50 మందికి ఐప్యాడ్‌లు అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకుండా, కేవలం స్టడీ మెటీరియల్‌, జనరల్‌ నాలెడ్జ్‌ మాత్రమే ఉండేలా ఈ ఐప్యాడ్‌లను రూపకల్పన చేశామన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ ఐప్యాడ్‌లను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. రాష్ట్రంలోనే 1234మంది విద్యార్థులతో ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాల రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇందిరానగర్‌ పాఠశాల అన్ని రంగాల్లో ముందుంటడానికి ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు కృషి గొప్పదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement