న్యూస్‌రీల్
రోగులకు పరీక్షే!
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడంలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు నర్సింగ్ హోంలు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం సెల్లార్లు.. పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సి ఉండగా పలు ఆస్పత్రులు సొంత అవసరాలకు వినియోగిస్తున్నాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి కోసం వచ్చే సహాయకులకు ఇబ్బందులు తప్పడంలేదు. కొన్ని చోట్ల సెల్లార్లను ల్యాబ్‌లు, రోగుల బంధువులు వసతి పొందేందుకు వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా విరుద్ధమని అధికారులకు తెలిసినా అటు మున్సిపాలిటీ.. ఇటు వైద్యారోగ్య శాఖ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
రోడ్లపైనే వాహనాల నిలిపివేత
● జిల్లా వ్యాప్తంగా 390 అన్ని రకాల ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. భవనాల నిర్మాణ సమయంలో సెల్లార్లను పార్కింగ్ కోసం వినియోగిస్తామంటూ మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. తర్వాత నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. అధికారులు అందిన కాడికి దండుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అధిక ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రోడ్ల పైనే వాహనాలు పార్కింగ్ చేయిస్తున్నారు. రోగులతో పాటు సహాయకులు, వైద్యుల వాహనాలు సైతం రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే అంబులెన్స్‌లను సైతం బయటే నిలుపుతున్నారు. రోడ్ల పైకి వచ్చిన భవనాలతో పాటు సెల్లార్లలో వైద్య సేవల నిర్వహణ, ట్రాఫిక్ ఇక్కట్లు, అగ్నిమాపక శాఖ నిబంధన ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
తనిఖీలు కరువు
పట్టణాల్లో మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నారు. ఇంటి నిర్మాణం నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా ? లేదా? పరిశీలించడం లేదు. సెల్లార్లలో పార్కింగ్ కాకుండా ఇతర అవసరాలకు యథేచ్ఛగా వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్పందించి సెల్లార్లలో ల్యాబ్‌లు, వైద్య సేవలు కాకుండా పార్కింగ్ కోసం వినియోగించుకునే విధంగా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం సెల్లార్‌లో ల్యాబ్ నిర్వహిస్తుండటమే కాకుండా.. రోగులు వేచి ఉండేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు వాహనాల పార్కింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. చేసేదిలేక రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.


