వర్గల్(గజ్వేల్): నిర్లక్ష్యం గోతులు దాటింది. నిరసన గళం రోడ్డెక్కింది. గోతుల బాటలో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. ప్రయాణికులు గాయాలపాలవుతున్న ఘటనలు నిత్యకృత్యమైనా వర్గల్ రోడ్డు బాగోగులు పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. అధికారులకు వినతులు చేసినా స్పందన లేకపోవడంతో సోమవారం ఏకంగా గ్రామ సర్పంచ్ దేవగణిక జయభారతి రోడ్డు పక్కన బైఠాయించి దీక్ష చేపట్టారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వర్గల్ ప్రధానరోడ్డును పునర్ నిర్మించాలని కోరారు. ఆర్‌అండ్‌బీ అధికారుల హామీతో దీక్ష విరమించారు.
ఖ్యాతి ఘనం.. రోడ్డు అధ్వానం
రాష్ట్రస్థాయిలో పేరొందిన విద్యాసరస్వతి క్షేత్రం, వెయ్యి ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న పారిశ్రామిక వాడ, నవోదయ విద్యాలయంతో వర్గల్ ఖ్యాతి ఇనుమడిస్తుంటే, గతుకులతో రోడ్డు ధ్వంసమై పరువుతీస్తోంది. రాజీవ్‌రహదారి నుంచి తూప్రాన్ జాతీయ రహదారికి బైపాస్‌గా నిలుస్తున్న ఈ రోడ్డుపై రాకపోకలకు సవాల్‌గా మారాయి.
అధికారులు పట్టించుకోకపోవడం వల్లే..
రోడ్డును బాగుచేయాలని అనేకసార్లు అధికారుల దృష్టికి తెచ్చామని వర్గల్ సర్పంచ్ జయభారతి తెలిపారు. అయినా ఎవరూ స్పందించలేదన్నారు. చేసేదిలేకే రోడ్డు కోసం దీక్ష చేపట్టామని చెప్పారు.
గోతులతో రోడ్డు ధ్వంసం
గ్రామ ఎల్లమ్మ ఆలయం నుంచి దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం దాకా ప్రధాన రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. ట్రాక్టర్, లారీలు తదితర వాహనాలు గోతులలో దిగబడుతున్నాయి. అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. ద్విచక్రవాహనదారులు గాయాలపాలవుతున్నారు. ౖపైపె మరమ్మతులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. వర్షం పడితే తారు లేచిపోయి సమస్య మొదటికే వస్తుంది. ఇక్కడ సీసీ రోడ్డు నిర్మిస్తేనే వర్గల్‌రోడ్డుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
ప్రతిపాదనలు పంపుతాం
వైఎస్సార్ విగ్రహం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు 400 మీటర్ల పొడవున సీసీ రోడ్డు రెన్యూవల్ కోసం, ప్యాచ్‌వర్కుల కోసం ఎస్టిమేట్లు పంపుతాం. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహన రాకపోకలకు మార్గం సుగమం చేస్తాం. అడ్మినిస్ట్రేటివ్ మంజూరు వచ్చిన వెంటనే పనులు చేపడతాం.
– రేణుక,
(ఆర్‌అండ్‌బీ డిప్యూటీఈఈ)
రోడ్డెక్కిన నిరసన గళం
వర్గల్ రోడ్డు కోసం సర్పంచ్ దీక్ష


