ములుగు(గజ్వేల్): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ములుగులో మంత్రి వివేక్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సొంతిల్లు లేని పేద కుటుంబం ఉండకూడదనే లక్ష్యంతో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిసహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే నిధులు ఇస్తూ పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రం, హౌసింగ్ ఎండీ గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హాజరైన మంత్రి వివేక్
రెండో విడత ఇందిరమ్మ
ఇళ్ల పత్రాలు అందజేత


