హుస్నాబాద్: అయోధ్య రామమందిరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దేవుడి పేరుతో బీజేపీ భారీ స్కాంకు పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జిల్లెల్లగడ్డలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఎంతో మంది విరాళాలు ఇచ్చారని తెలిపారు. చందా బుక్కులు పట్టుకొని ఊరూరా తిరిగారని, వసూలు చేసిన డబ్బులు ఎవరికి పోయాయో, ఎవరి వద్ద ఉన్నాయో లెక్కలు లేవన్నారు. రాముడి పేరిట చందాలు వసూలు చేసిన కోట్లాది రూపాయలు మాయం చేశారని ఆరోపించారు. ప్రతి ఊరిలో జైశ్రీరాం అంటూ అక్షింతలు పంచి ఓట్లు అడిగిన బీజేపీ, ఇప్పుడు అదే రామమందిరంలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడటంలేదన్నారు. ఆలయంలో జరిగిన అవినీతిపై మోదీ, అమిత్‌షా, ఆ రాష్ట్ర సీఎంతోపాటు తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడంలేదన్నారు. అయోధ్య ఆలయంలో సొమ్ములు దొంగిలించడంపై హిందువులందరికీ అవమానకరమన్నారు. రామమందిరంలో జరిగిన అవినీతి పై తప్పును ఒప్పుకొని బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో అద్యక్షుడు శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆత్మ డివిజన్ అధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్న రాజు తదితరులు ఉన్నారు.
భక్తి, అక్షింతల పేరిట రాజకీయాలు
మంత్రి పొన్నం ప్రభాకర్


