రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్
చిన్నకోడూరు(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ పేర్కొన్నారు. చిన్నకోడూరులో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా గతంలో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్‌లుగా తెచ్చిందన్నారు. దీనివల్ల కార్మికులకు మేలు జరగదన్నారు. కంపెనీల యజమానులకు లాభాలు చేకూర్చే విధంగా చట్టాలను మారుస్తుందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా, యూరియా యాప్ ప్రవేశపెట్టి, ఎరువుల ధరలు పెంచిందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తుందని విమర్శించారు. సమావేశంలో నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దశరథం, బాలయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు.
ఇంటర్ ఫస్టియర్‌లో
రేపు స్పాట్ అడ్మిషన్లు
హుస్నాబాద్‌రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీ సీట్లకు ఈ నెల 6న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డీసీఓ శ్యామలత ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారుఉ. బాలుర కళాశాల వర్గల్, కొండపాక, చిన్నకోడూరు, అల్వాల్, చేర్యాల, హుస్నాబాద్, బాలికల కళాశాలలు ములుగు, జగదేవ్‌పూర్,రామక్కపేట, సిద్దిపేటరూరల్, మిట్టపెల్లి, బెజ్జంకి,తొగుట,గజ్వేల్ కళాశాలలో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు నాలుగు పాసు పోర్టు సైజ్ ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. బాలురకు మిరుదొడ్డి మండలం అల్వాల్ గురుకుల కళాశాలలో, బాలికలకు ములుగు బాలికల గురుకుల కళాశాలలో 6వ తేది ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నాం 1–00 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
చిత్తశుద్ధితో పనిచేయండి
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
సిద్దిపేటజోన్: అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. పట్టణంలోని 43 వార్డుల్లో ఆయన సర్ ప్రక్రియ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసి వాటి పనితీరును ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెల్ప్ డెస్క్‌లో పనిచేస్తున్న సిబ్బంది ప్రజల అనుమానాలను నివృతి చేయాలని సూచించారు. విధులకు గైర్హాజరు అయినా, అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులకు అండగా కాంగ్రెస్
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లను జమ చేసిందని ఆయన వెల్లడించారు. పటాన్‌చెరు అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని 21 వేలమంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల రైతు భరోసా నిధులు జమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, అంజయ్యరాజు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు పాల్గొన్నారు.


